ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న మంత్రి ఆర్కే రోజా తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను ఎవరు వ్యతిరేకించినా వారికే నష్టం కలుగుతుందని తెలిపారు. సీఎం జగన్ తన సొంత కృషితో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఏం జరిగిందో అందిరికీ తెలుసన్నారు. అప్పుడు వైశ్రాయి హోటల్లో మొదలు పెట్టిన వెన్నుపోటు రాజకీయాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తానంటూ కట్టుకున్న భార్య పరువును పక్కన పెట్టి అసెంబ్లీకీ చంద్రబాబు నాయుడు వచ్చారని వ్యాఖ్యానించారు. రాజకీయం అంటేనే అసహ్యించుకేనే పరిస్థితికి టీడీపీ స్థితి దిగజారిపోయిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలకు భవిష్యత్తు ఉండదని పేర్కొన్నారు. సీఎం జగన్ ను రాజకీయంగా మోసం చేసినవారెవరైనా చరిత్రహీనులుగానే మిగిలిపోతారని తెలిపారు. టీడీపీకి ఓటు వేసిన వారు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఉద్ఘాటించారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..