
గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ నియంత్ర ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన మహిళ శరీరంలో సర్జికల్ బ్లేడ్‌ను వదిలేసిన ఘటన కలకలం రేపింది. నరసరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి (22) కుటుంబ నియంత్ర ఆపరేషన్ కోసం ఆస్పత్రిలో చేరింది. రమాదేవికి ఆపరేషన్ చేశారు డాక్టర్ నారాయణ స్వామి, ఆయన సిబ్బంది. అయితే, ఆపరేషన్ తర్వాత ఆమె తీవ్రమైన నొప్పితో అవస్థ పడింది. దాంతో వెంటనే ఆమె తిరిగి ఆస్పత్రికి చేర్చారు. నొప్పి సహజం అని బాధితురాలికి చెప్పిన ఆసుపత్రి డాక్టర్,సిబ్బంది తిరిగి ఇంటికి పంపించేశారు.
ఈ క్రమంలోనే నొప్పి తట్టుకోలేక అవస్థ పడుతున్న బాధితురాలికి స్కానింగ్ చేయగా స్కానింగ్ రిపోర్ట్‌లో ఆమె తోడ దగ్గరలో ఒక సర్జికల్ బ్లేడు ఉన్నట్లు గుర్తించారు. అది చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాధిత మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్ పై బంధువుల మండిపడ్డారు. న్యాయం చేయాలని ఆసుపత్రిలో ఆందోళనకి దిగారు. పైగా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి సిబ్బంది 2500 తీసుకున్నారని బాధితురాలు రమాదేవి ఆరోపించింది.
అయితే, యువతి శరీరంలో సర్జికల్ బ్లెడ్ ఉండడం తన తప్పు కాదని ఆపరేషన్ చేసిన డాక్టర్ చెబుతున్నారు. ఆపరేషన్ అనంతరం తనకు మరో కేసు ఉండటంతో వెళ్లిపోయానని, క్లినింగ్ చేసే వారు సరిగా క్లినింగ్ చేయలేదంటూ సమాధానం ఇచ్చారు డాక్టర్ నారాయణ స్వామి. కానీ, ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ఇంత ఘోరమైన నిర్లక్ష్యానికి పాల్పడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దారుణ ఘటన నేపథ్యంలో మహిళ కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత మహిళకు తక్షణమే మెరుగైన వైద్యం అందించేలా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.