Andhra Pradesh: ఇదేం దున్నపోతు బాబోయ్..! గుర్తు పెట్టుకుని వచ్చి మరీ కుమ్మేస్తుంది.. వీడియో వైరల్
పగ పట్టిన పాము కాటేసే వరకు వదలదు అన్నది మనం ఇప్పటివరకు వినుంటాం. కానీ ఆ దున్నపోతు తనను కొట్టిన వారిని గుర్తుపెట్టుకుని మరీ వచ్చి కుమ్మేస్తుంది. అచ్చోసిన ఆంబోతు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఆ దున్నపోతు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం సొల్లాపురంలో ఓ దున్నపోతు రోడ్డు మీద మనుషులు కనబడితే చాలు రెచ్చిపోతుంది. దీంతో ఆ గ్రామస్తులు దాన్ని చూస్తేనే బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పంట పొలాల మీద పడి మేయడం....

అనంతపురం, జనవరి 25: పగ పట్టిన పాము కాటేసే వరకు వదలదు అన్నది మనం ఇప్పటివరకు వినుంటాం. కానీ ఆ దున్నపోతు తనను కొట్టిన వారిని గుర్తుపెట్టుకుని మరీ వచ్చి కుమ్మేస్తుంది. అచ్చోసిన ఆంబోతు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఆ దున్నపోతు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం సొల్లాపురంలో ఓ దున్నపోతు రోడ్డు మీద మనుషులు కనబడితే చాలు రెచ్చిపోతుంది. దీంతో ఆ గ్రామస్తులు దాన్ని చూస్తేనే బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పంట పొలాల మీద పడి మేయడం…. ఊళ్లో ఇళ్ళ ముందుకు వచ్చి ధాన్యం తినడం…. ఎవరైనా గద్దిస్తే కొమ్ములతో కుమ్మడం… ఇది ఆ దున్నపోతు పని. సొల్లాపురం గ్రామంలో ఆ దున్నపోతు కనిపించిందంటే రోడ్డుమీద మగవాళ్ళు పంచెలు ఎగగట్టుకుని పారిపోవాల్సిందే. ఇక మహిళలైతే ఇళ్ళ ముందు కూర్చునే పరిస్థితి లేదు. తలుపులేసి లోపల కూర్చోవాల్సిందే. ఆరు నెలల క్రితం గ్రామంలో సంచరిస్తున్న దున్నపోతును చూసి అందరూ గ్రామ దేవత అమ్మోరుకు బలిచ్చేందుకు వదిలిన దున్నపోతు అనుకున్నారు.
గత ఆరు నెలలుగా సోల్లాపురం గ్రామంలోని పంట పొలాల్లో తిరుగుతూ మేయడం, అక్కడ మేత దొరక్కపోతే ఊళ్ళోకి వచ్చి ఇళ్ల ముందున్న మేత లేదంటే ఇంటిముందు ఆరబోసినటువంటి ధాన్యం గింజలు ఉంటే తింటుంది. ఇలా పంట పొలాలు నాశనం చేసేటప్పుడు, ఇంటి ముందుకు వచ్చి ధాన్యం గింజలను తింటున్నప్పుడు ఎవరైనా ఆ దున్నపోతును గద్దించటం, తరిమికొడుతున్నా కూడా అది అలాగే ఉంటుంది. ఇలా తనను ఎవరైనా గద్దించినా, కర్రతో కొట్టినా వారిని గుర్తుపెట్టుకుని మరి ఆ దున్నపోతు కుమ్మేస్తోంది. తాజాగా రసూలమ్మ అనే మహిళ ఇంటి ముందు కూర్చొని ఉండగా ధాన్యం గింజలు తింటున్న దున్నపోతును గద్దించింది. అంతే ఆమెను దున్నపోతు గుర్తు పెట్టుకొని వచ్చి మరి ఆ మహిళను తన కొమ్ములతో కుమ్మేసింది. తీవ్ర గాయాలు పాలైన రసూలమ్మను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గడిచిన ఆరు, ఏడు నెలలుగా దున్నపోతు బారినపడి 50, 60 మంది మంది వరకు గాయపడ్డారని ఇదేం దున్నపోతు బాబోయ్ అంటూ.. దున్నపోతు దాడి నుంచి తమను కాపాడాలంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు.
దున్నపోతి దాడిపై గ్రామ సర్పంచ్, అదే విధంగా గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే అనేకసార్లు పోలీసులకు, వెటర్నరీ, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆ దున్నపోతును బంధించాలని లేదా సమీపంలోని అడవిలోకి తరిమేయాలని నిశ్చయించుకున్నారు. ఎట్టకేలకు గ్రామస్తుల మొరాలకించిన అటవీ శాఖ అధికారులు త్వరలోనే మత్తు ఇంజక్షన్ ఇచ్చే గన్ ద్వారా దున్నపోతును బంధించి అడవిలో వదిలిపెడతామని హామీ ఇచ్చారు. అప్పటివరకు దున్నపోతు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందో అన్న భయంతో గ్రామస్తులు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. అదేంటో రోడ్డు మీద నలుగురు మనుషులు కనబడితే చాలు పూనకం వచ్చినట్టు దున్నపోతు ఊగిపోయి రంకెలు వేస్తూ వచ్చి మరి కుమ్మేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








