
అది మద్యం కాదు.. కాలకూట విషం..! కిక్కు మాటున మీ ప్రాణాలను తోడేసే హాలాహలం..! ఒరిస్సా నుంచి ప్రమాదకర రసాయనాలు తీసుకొచ్చి.. వాటిని మద్యంలా తయారుచేసి పేదవాడి గొంతులో పోసేస్తోంది ఆ కిలాడి కపుల్. మత్తెక్కించే డ్రగ్స్‌తో మద్యం తయారీ చేసి బెల్ట్ షాపులకు సప్లై చేసేస్తున్నారు. ఎస్ ఈ బి అధికారులు కూపీ లాగి కల్తీ మద్యం దందా వెలుగులోకి తెచ్చినప్పటికీ.. ఇంకా కొన్ని బెల్ట్ షాపుల్లో ప్రమాదగంటికలు మోగిస్తున్నాయి ఆ కల్తీ మద్యం బాటిళ్లు.
కళ్ళ ముందు కనిపిస్తున్నావన్నీ అసలైన మద్యం బాటిళ్ళు కాదు. ఒరిజినల్ గా కనిపిస్తుంటాయి అంతే..! ఇంపీరియల్ బ్లూ విస్కీ, రాయల్ స్టాగ్ ఫైన్ విస్కీ, స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ.. ఇలా ఇటువంటి బ్రాండ్ల పేరుతో ఇప్పుడు విశాఖ అనకాపల్లి జిల్లా శివారులలో బెల్ట్ షాపుల్లో సప్లై అయిపోతున్నాయి. ఒరిజినల్ గా కనిపించే ఈ బాటిళ్లలో.. ప్రమాదకర రసాయనంతో తయారుచేసిన కల్తీ మద్యం నింపి ఉంది. బాటిళ్ళు, లేబుళ్లు, స్టిక్కర్లు, మూతలు అన్నీ డూప్లికేట్ వే. కానీ బెల్ట్ షాపుల్లోకి సప్లై చేసి.. పేదోడి గొంతులో పోసేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే.. బరంపురం ప్రాంతానికి చెందిన సుశాంత్ పాత్రో పై గతంలో పలు ఎక్సైజ్ కేసులు ఉన్నాయి. ఎన్ఫోర్స్‌మెంట్ వర్గాల మానిటరింగ్ నిఘాకు తప్పించుకుని తిరుగుతుండడంతో అనుమానం వచ్చింది. దీంతో పెందుర్తి ప్రాంతంలో ఉన్న అతని ఇంటికి వెళ్లారు. అక్కడ సోడాలు చేస్తే, 8 మద్యం బాటిళ్లు లభించాయి. ఇంట్లో సుశాంత్ పాత్ర లేడు. భార్య శిరీషను పట్టుకుని ఎస్ ఈ బి అధికారులు విచారించారు. దీంతో కీలక సమాచారం బయటపడింది. ఆ మధ్యాహ్నం వాళ్ళిద్దరే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు.. అది కూడా ప్రమాదకర కెమికల్స్‌తో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నే పెట్టినట్టు గుర్తించారు అధికారులు.
ప్రాథమిక సమాచారాన్ని అందుకున్న అధికారులు.. కూపీ లాగారు. దీంతో లింకు విజయనగరం జిల్లా కొత్తవలసకు తగిలింది. అక్కడ ఓ మారుమూల ప్రాంతంలో ఒక కుటీర పరిశ్రమనే పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసేస్తున్నారు. అందుకోసం బెల్లడోనో అనే హోమియో మందును హై డోస్లో వినియోగించి మద్యం తయారు చేస్తున్నారు. అందుకోసం ప్రమాదకరమైన హోమియో డ్రగ్ ను వాడేస్తున్నారు. బేలడోనా డ్రగ్స్ ను హోమియో వైద్యులు కేవలం ఒక చుక్కను డోస్ గా రిఫర్ చేస్తారు. కానీ ఈ దంపతులు వాటిని డైరెక్ట్ గా కల్తీ మద్యంలో పోసి తాగించేస్తున్నారు. ఈమద్యం తాగితే కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు అధికారులు. ముందస్తుగా భారీ ముప్పునే నివారించగలిగామంటున్నారు పోలీస్ అధికారులు.
ఈ దంపతులు ముడి సరుకును ఒరిస్సా నుంచి రప్పిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇంపీరియల్ బ్లూ విస్కీ, రాయల్ స్టాగ్ ఫైన్ విస్కీ, స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ బ్రాండ్ల స్టిక్కర్లు అతికించి బాటిల్స్ లో కల్తీ మద్యాన్ని నింపి వాటిని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 50 రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసి వాటిని 250 రూపాయలకు అమ్ముతున్నట్టు గుర్తించారు ఎస్ ఈ బి అధికారులు. కాగా, ఈ సందర్భంగా జరిపిన దాడుల్లో 1,051 లీటర్లతో కూడిన 1,065 బాటిళ్ళ కల్తీ మద్యం, కెమికల్స్ ను సీజ్ చేసిన ఎస్ ఈ బి అధికారులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అయితే ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో దాదాపుగా 700 బాటిల్స్ వరకు బెల్ట్ షాపులకు సరఫరా అయినట్టు గుర్తించారు అధికారులు. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇంపీరియల్ బ్లూ విస్కీ రాయల్ స్టాగ్ స్టెర్లింగ్ రిజర్వ్ బ్రాండ్ల బాటిల్స్ బెల్ట్ షాపుల్లో కనబడితే వాటిని తాగొద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే సరఫరా అయిన బాటిళ్ళను ట్రాక్ చేసేందుకు అక్కడి అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. అయితే సుశాంత్ పాత్ర పై గతంలోనూ రెండు కేసులు ఉన్నాయి. తాజా కల్తీ మద్యం కేసు నేపథ్యంలో వాళ్లపై పిడి యాక్ట్ పెట్టేందుకు ప్రబోజల్స్ పంపిస్తున్నారు విశాఖ పోలీసులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…