Andhra: ఆ చనువే కొంపముంచింది.. భార్యతో కనిపించిన ఫ్రెండ్.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆ ఐదుగురు స్నేహితులే.. అంతా కలిసి నాటువైద్యం.. తాంత్రిక వైద్యం చూస్తూ స్నేహంగా ఉండేవారే. అయితే ఒకరి భార్యతో మరొకరు చనువుగా ఉండటంతోనే తేడా వచ్చింది. కసితో కడ తీర్చాలని ప్లాన్ చేసి ఐదుగురిలో ఒకరిని హత మార్చి పూడ్చి పెట్టారు. అయితే హత్యకు గురైన వ్యక్తి భార్య ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి..

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నర్సింగాపురం రైల్వే స్టేషన్ వద్ద పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు.. మదనపల్లిలో నమోదైన మిస్సింగ్ కేసును చేధించారు. దాదాపు నెలన్నర క్రితం అదృశ్యమైన వ్యక్తి డెడ్ బాడీగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన 40 ఏళ్ల ఆవుల నరసింహులు గత అక్టోబర్ 27 నుంచి కనిపించడం లేదు. భార్య విజయలక్ష్మి మదనపల్లి తాలూకా పీఎస్ లో చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు కాగా.. ఆవుల నరసింహులు ఆచూకీ కనుక్కునే ప్రయత్నంలో పోలీసుల దర్యాప్తు చేట్టారు. ఈ క్రమంలోనే నిప్పులాంటి నిజం వెలుగుచూసింది..
మదనపల్లి రూరల్ మండలం రామాపురం గ్రామానికి కు చెందిన ఆవుల నరసింహులుకు నాగరాజు, కత్తి నరసింహులు, నారాయణస్వామి చంద్రగిరి మండలం ముని రాజా స్నేహితులుగా గుర్తించిన పోలీసులు.. కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలను గుర్తించారు. నాటు వైద్యం, తాంత్రిక వైద్యం చేస్తున్న ఈ ఐదుగురు మంచి స్నేహితులని తేల్చారు. అయితే ఆవుల నరసింహులు నాగరాజు భార్యతో ఉన్న చనువు అనుమానాలకు దారితీసింది. దీంతో నరసింహులపై కోపంగా ఉన్న నాగరాజు పక్కా ప్లాన్ వేసి అంతమొందించాలని నిర్ణయించారు. ఈ మేరకు గత అక్టోబర్ 27న చంద్రగిరిలో ఒకరికి తాంత్రిక వైద్యం చేయాలని ఈ మేరకు నరసింహులు నారాయణస్వామి కత్తి నరసింహులను మదనపల్లిలో బస్సు ఎక్కించి చంద్రగిరికి పంపాడు. తాను వెనక నుంచి వస్తానంటూ వారిని నమ్మించాడు.. ప్లాన్ ప్రకారమే చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో బస్సు దిగిపోయిన నాగరాజు నరసింగాపురంలో ఉంటున్న స్నేహితుడు మునిరాజాను అక్కడికి పిలిపించుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆవుల నరసింహలును శ్రీనివాస మంగాపురం దగ్గరికి రప్పించుకున్నారు. అక్కడి నుంచి మామిడి తోపులోకి తీసుకెళ్లారు. నాగరాజు మునిరాజాతో కలిసి ఆవుల నరసింహులు కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. అక్కడే గోతిని పూడ్చిపెట్టి అక్కడి నుంచి జారుకున్నారు.
డెడ్ బాడీని వెలికి తీయడంతో బయటపడ్డ నిజం..
ఇంటి నుంచి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి రాకపోవడంతో విజయలక్ష్మి నరసింహులు మిస్సింగ్ పై ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు ను విచారించిన పోలీసులు.. స్నేహితుల పాత్ర పై అనుమానం వచ్చి దర్యాప్తు చేశారు. నాగరాజు, ముని రాజా లకు సహకరించిన స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆవుల నరసింహుల హత్య కేసును చేధించారు. చంద్రగిరి మండలం నరసింగాపురం రైల్వే స్టేషన్ సమీపంలో పాతిపెట్టిన మృతదేహం వెలికితీసిన పోలీసులు ఆవుల నరసింహులు డెడ్ బాడీగా గుర్తించారు. నర్సింహులును హత్య చేసి పూడ్చిపెట్టినట్లు గుర్తించిన పోలీసులు.. దీనికి కారణం వివాహేతర సంబంధం కారణం అని భావించారు. నాగరాజు అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు.. నరసింహులపై కక్ష్య పెంచుకునే ఈ హత్య చేసినట్లు తేల్చారు. వివాహిత భర్త నాగరాజ్ స్నేహితులతో కలిసే హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. నాగరాజు అతని స్నేహితులు మునిరాజా మరి కొందరితో కలిసి నర్సింహులు ను హత్య చేసి నరసింగాపురం వద్ద పూడ్చి పెట్టారని విచారణలో వెల్లడించారు. పోలీసుల విచారణలో నాగరాజు నేరాన్ని అంగీకరించగా తహశీల్దార్ సిఐ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు.. ఘటన స్థలం వద్దే పోస్టుమార్టం నిర్వహించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




