టీ షాప్ వద్ద బ్యాగ్‌లతో అనుమానంగా కనిపించిన గ్యాంగ్.. దగ్గరికెళ్లి చెక్ చేయగా.. వామ్మో..
గుట్టు చప్పుడు కాకుండా నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న కంత్రి గాళ్ల బండారం అన్నమయ్య జిల్లాలో బయట పడింది. మూడో కంటికి తెలియకుండా మదనపల్లి కేంద్రంగా సాగుతున్న యవ్వారం ముఠా అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో పోలీసులు చేపట్టిన దాడుల్లో మదనపల్లి జిల్లాలో నకిలీ నోట్ల చెలామణి చేస్తున్న ముఠా దొరికిపోయింది.

మదనపల్లి- అనంతపురం వెళ్లే బైపాస్ రోడ్డులోని దొమ్మనబావి వద్ద బ్యాగ్‌లతో అనుమానాస్పదంగా ఆరుగురు వ్యక్తులు పోలీసుల కంటపడ్డారు. టీ షాప్ వద్దనే ఉన్న ముఠా దగ్గరికి కొందరు వ్యక్తులు వచ్చి వెళుతుండడం గమనించిన పోలీసులు విచారించే ప్రయత్నం చేశారు. గ్రామీణ ప్రాంతాలు, సంతలను టార్గెట్ చేసుకుని నకిలీ నోట్ల చలామణికి ప్రయత్నించిన ముఠా వందకు రెండు వందల ప్రకారం ఇస్తామంటూ ఆశ చూపి బిజినెస్ కొనసాగిస్తూ వచ్చారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు సమాచారం ఉన్న పోలీసులు పక్కా ప్లాన్ తో ముఠాను అదుపులోకి తీసున్నారు.
అనంతరం వారిని పీఎస్‌కు తీసుకెళ్లి ప్రశ్నించినగా మొత్తం 9 మంది సభ్యుల ముఠా ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దొమ్మనభావి గ్రామం వద్ద ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి రూ 2.10లక్షల నకిలీ నోట్లను 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కర్ణాటక, తెలంగాణ రాష్టానికి చెందిన వాళ్లు ఉన్నట్టు గుర్తించారు. పట్టుబడిన వారిలో మహమ్మద్ జూవైద్, హైదరాబాద్‌కు చెందిన మాణిక్ రెడ్డి, సైమన్, తెలంగాణలోని భూపాలపల్లి చెందిన సుమన్, సత్యసాయి జిల్లా కు చెందిన వెంకటేష్, వాయల్పాడుకు చెందిన రమణ ఉన్నారు.
వీరు ఎక్కడైతే అంగళ్లు అవుతాయో అక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ నోట్లను మార్పిడి చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారి ఉంటున్న ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు హైదరాబాద్‌కు లింకులు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచే నకిలీ నోట్లను మదనపల్లి ప్రాంతానికి తీసుకొస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరిని గుర్తించే పనిలో ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
