Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. మరో నాలుగు రోజులు వానలే వానలు.. బీఅలర్ట్..

|

Jul 24, 2023 | 7:31 AM

Rain Alert For AP & TS: తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడిచిపెట్టడం లేదు. నిన్న ఒక్కరోజు కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షాలు.. నేటి నుంచి మళ్లీ కంటిన్యూ కానున్నాయి. ఇప్పటికే.. ఏపీ, తెలంగాణలో ఎడతెరపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. మరో నాలుగు రోజులు వానలే వానలు.. బీఅలర్ట్..
Rain Alert
Follow us on

Rain Alert For AP & TS: తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడిచిపెట్టడం లేదు. నిన్న ఒక్కరోజు కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షాలు.. నేటి నుంచి మళ్లీ కంటిన్యూ కానున్నాయి. ఇప్పటికే.. ఏపీ, తెలంగాణలో ఎడతెరపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరికి.. వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. అయితే, వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. వానలు కాస్త గ్యాప్ ఇచ్చాయనుకునే లోపే హైదరాబాద్ వాతావరణ శాఖ మరో బాంబ్ లాంటి వార్త పేల్చింది. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ దగ్గరలోని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో నేటినుంచి మూడు, నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే.. వచ్చే మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా.. రేపు, ఎల్లుండి మాత్రం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది హైదరాబాద్‌ వాతావరణ శాఖ. ఇప్పటికే.. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసింత వర్షం తగ్గినా.. వరద మాత్రం అలానే కొనసాగుతూనే ఉంది.

భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ..

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం కరకట్ట వద్ద స్నాన ఘట్టాలు మునిగిపోయాయి. దాంతో.. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వరదను పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే.. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాల్వంచ కిన్నెరసాని జలాశయం పరవళ్లు తొక్కుతోంది.

రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు..

తెలంగాణలోనే కాదు.. ఏపీకీ భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనంతో రానున్న మూడ్రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండ్రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడే చాన్స్‌ ఉందంటోంది వాతావరణ శాఖ. ఇక.. ఏపీలో గోదావరి జిల్లాలను వరద హడలెత్తిస్తోంది. రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. దాంతో.. నదీపరీవాహక ప్రాంతాల్ని ఖాళీ చేయించారు అధికారులు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని వైనతేయ, వశిష్ట, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక.. ఇప్పటికే.. లంక గ్రామాలు మూడు, నాలుగు రోజులుగా వరద ముంపులో కొట్టుమిట్టాడుతున్నాయి. అరటి, కూరగాయల పంట భూములన్నీ నీటమునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అంతేకాదు.. వరద తాకిడికి కోనసీమలో అక్కడికక్కడ కోతకు గురవుతున్నాయి లంక భూములు.

ఇవి కూడా చదవండి

మొత్తంగా.. ఇటు తెలంగాణ.. అటు ఏపీలో మరో మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..