Andhra News: బయటికెళ్తూ ఇంటి తాళం చెవి చెప్పుల స్టాండ్‌లో పెడుతున్నారా? ఇలానే అవుతుంది
ఇంట్లో నుండి బయటికి వెళ్తూ ఇంటి తాళం వేసి తాళాలు చెప్పుల స్టాండ్ లో పెట్టి వెళ్తున్నారా? జరభద్రం.. విజయనగరం జిల్లాలో అలా చేసి వెళ్లడంతోనే ఇళ్లంతా గుళ్లయింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి.....
రాజాం మండలం ఈశ్వర్ నగర్ కాలనీలో సత్యనారాయణ అనే ఒక జనరల్ స్టోర్ వ్యాపారి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజు ఉదయాన్నే సత్యనారాయణ తన భార్యతో కలిసి ఇంటి నుండి షాప్‌కి వెళ్తాడు. మళ్లీ షాప్ క్లోజ్ చేసి రాత్రికి ఇంటికి తిరిగి వస్తారు. అయితే ఉదయం షాప్‌కి వెళ్లేటప్పుడు ఇంటికి తాళం వేసి ఆ తాళాన్ని ఇంటి బయట ఉన్న షూ స్టాండ్‌లో పెట్టి వెళ్లడం వీరికి అలవాటు. అంతే కాకుండా ఇంట్లో ఉన్న బీరువా తాళాలు సైతం తాళం వేసి బీరువా మీదే పెడుతుంటారు. అయితే ఎప్పటిలాగే ఇంటికి తాళం వేసి… దాని కీ షూ స్టాండ్‌లో పెట్టి షాప్‌కి వెళ్లిపోయారు సత్యనారాయణ దంపతులు. తిరిగి సాయంత్రం షాపు క్లోజ్ చేసి ఇంటికి వచ్చేసరికి తలుపు తెరిచి ఉంది. ఆందోళనతో లోపలికి వెళ్లి చూసేసరికి బీరువా కూడా తెరిచి ఉంది. తెరిచి ఉన్న బీరువాను వెతికి చూడగా బీరువాలో దాచిన 15 తులాల బంగారం కనిపించలేదు. దీంతో తమ ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి బంగారు ఆభరణాలు దొంగిలించారని తెలిసి లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయగా క్లూస్ టీం రంగంలో దిగి విచారణ చేపట్టింది.
అయితే షూ స్టాండ్‌లో ఉన్న కీ లేకపోవడం, బీరువా మీద ఉన్న కీస్‌తోనే బీరువా తెరవడం గమనించిన పోలీసులకు దొంగతనం జరిగిన తీరును విళ్లేషించారు. షూ స్టాండ్‌లో ఉన్న తాళం తీసి లోపలకి ప్రవేశించి బీరువా మీద ఉన్న బీరువా తాళం తీసి దర్జాగా బంగారం దొంగిలించినట్లు అభిప్రాయపడ్డారు పోలీసులు. ఇదంతా తాళాలు పెట్టిన విషయం తెలిసినవారే చేశారని నిర్ధారణకు వచ్చి వెంటనే తాళాలు ఎక్కడ ఉంటాయో తెలిసిన సత్యనారాయణ షాపులో పనిచేస్తున్న యువకుడిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సహజంగా చాలామంది ఇంటికి తాళం వేసి ఆ తాళాలు షూస్టాండ్‌లో కానీ, ఇంటి బయట ఉన్న కిటికీ లేదా ఆరు బయట ఉండే మొక్కల వద్ద పెట్టి వెళ్తుంటారు. అలా తాళాలు పెట్టే యాజమానుల అలవాటే కొందరు కేటుగాళ్లకు వరంగా మారుతుందని అంటున్నారు పోలీసులు. తాళాలు పెట్టే సమయంలో ఎవరో ఒకరు చూడటం అలా చూసినవారే అదును చూసి దొంగతనానికి పాల్పడటం జరుగుతుందని, దయచేసి ఎవరు కూడా తాళాలు ఇంటి బయట పెట్టి దొంగల చేతికి మీరే తాళాలు అందించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..