AP News: పీఆర్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈనెల 27న ఛలో విజ‌య‌వాడకు జేఏసీ పిలుపు..

| Edited By: Srikar T

Feb 23, 2024 | 6:16 PM

ఆంధ్రప్రదేశ్‎లో ఉద్యోగులు మ‌ళ్లీ ఆందోళ‌న బాట ప‌ట్టారు. అయితే ఈసారి అన్ని సంఘాలు కాకుండా కేవ‌లం ఏపీ జేఏసీ మాత్రమే ఆందోళ‌న‌లో పాల్గొంటుంది. ఏపీ జేఏసీలో ఉన్న సంఘాల్లోని ఉద్యోగులు కొంత‌కాలంగా వివిధ రూపాల్లో ఆందోళ‌న చేస్తున్నారు. త‌మ డిమాండ్లు ప‌రిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంట్లో భాగంగా ఈనెల 27న పెద్ద ఎత్తున ఛలో విజ‌య‌వాడ కార్యక్రమం నిర్వహించాల‌ని ఏపీ జేఏసీ నేత‌లు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

AP News: పీఆర్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈనెల 27న ఛలో విజ‌య‌వాడకు జేఏసీ పిలుపు..
Employees Union Bopparaju
Follow us on

ఆంధ్రప్రదేశ్‎లో ఉద్యోగులు మ‌ళ్లీ ఆందోళ‌న బాట ప‌ట్టారు. అయితే ఈసారి అన్ని సంఘాలు కాకుండా కేవ‌లం ఏపీ జేఏసీ మాత్రమే ఆందోళ‌న‌లో పాల్గొంటుంది. ఏపీ జేఏసీలో ఉన్న సంఘాల్లోని ఉద్యోగులు కొంత‌కాలంగా వివిధ రూపాల్లో ఆందోళ‌న చేస్తున్నారు. త‌మ డిమాండ్లు ప‌రిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంట్లో భాగంగా ఈనెల 27న పెద్ద ఎత్తున ఛలో విజ‌య‌వాడ కార్యక్రమం నిర్వహించాల‌ని ఏపీ జేఏసీ నేత‌లు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. విజ‌య‌వాడ బీఆర్టీఎస్ రోడ్డులో పెద్ద ఎత్తున ఆందోళ‌న ద్వారా స‌మ‌స్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల‌ని నిర్ణయించారు. అయితే ఉద్యోగుల ఆందోళ‌న‌తో మంత్రివ‌ర్గ ఉప‌సంఘం వారితో చ‌ర్చలు జ‌రిపింది. ఒక్క ఏపీ జేఏసీనే కాకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‎లో ఉన్న 13 సంఘాలను చ‌ర్చల‌కు పిలిచింది ప్రభుత్వం. సుమారు 3 గంట‌ల పాటు ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో ప్రభుత్వం చ‌ర్చలు జ‌రిపింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని 13 ఉద్యోగ సంఘాల‌తో మంత్రివ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశ‌మైంది. ఉద్యోగుల స‌మ‌స్యలు, వారి డిమాండ్లపై సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డితో పాటు మంత్రి బొత్స, స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణా రెడ్డి చ‌ర్చలు జ‌రిపారు.

అయితే ఏపీ జేఏసీ అమ‌రావ‌తితో పాటు మిగిలిన సంఘాలు మాత్రం చ‌లో విజ‌య‌వాడ‌కు మ‌ద్దతు ప్రక‌టించ‌లేదు. అయినా ఉద్యోగుల ఆందోళ‌న‌ను విర‌మింప‌చేసే విధంగా చ‌ర్చలు జ‌రిపింది కేబినెట్ స‌బ్ క‌మిటీ. ఈ నెల 27న జ‌ర‌ప‌త‌ల‌పెట్టిన ఛలో విజయవాడను విరమించుకోమని ఏపీ జేఏపీ నేతలను కోరిన‌ట్లు మంత్రి బొత్స సత్యనారాయ‌ణ తెలిపారు. ఉద్యోగ సంఘాల నిర్ణయం సానుకూలంగా ఉంటుందని అనుకుంటున్నామ‌న్నారు. ఇప్పటికే 12వ పీఆర్సీ క‌మిష‌న్ నియ‌మించినందున మ‌ధ్యంత‌ర భృతి లేకుండా గ‌డువులోగానే పీఆర్సీ అమ‌లుచేసేలా చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు. మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌.. మార్చిలోపు బకాయిలు చెల్లింపు పూర్తి చేస్తామ‌న్నారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వంతో చ‌ర్చలు సానుకూలంగా జ‌ర‌గ‌లేద‌ని చెప్పుకొచ్చాయి.

ఈనెల 27న ఏపీ జేఏసీ నేత‌ల ఛలో విజ‌య‌వాడ..

ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ప‌లు డిమాండ్లతో ఉద్యోగులు ఆందోళ‌న చేస్తున్నారు.30 శాతం ఐఆర్ ప్రక‌ట‌న‌, ఉద్యోగుల బ‌కాయిలు చెల్లింపులతో పాటు మొత్తం 49 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు చ‌ర్చల‌కు హాజ‌ర‌య్యాయి. వీటిలో 29 అంశాలు శాఖ‌ల‌వారీగా చ‌ర్చలు జ‌రిపి ప‌రిష్కరిస్తామ‌ని సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి హామీ ఇచ్చారు. మిగిలిన 20 డిమాండ్లపై సానుకూల స్పంద‌న రాలేద‌న్నారు ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస‌రావు. గత స‌మావేశంలో ఇచ్చిన హామీలు ఇంకా నెర‌వేర్చాల్సి ఉందన్నారు.30 శాతం ఐ ఆర్ అడిగామని.. జూన్ నాటికి PRC ఇస్తామన్నా.. DA ల గురించి చెప్పలేదన్నారు బండి.
అందుకే త‌మ ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు బండి తెలిపారు. డిమాండ్‎ల విషయంలో పురోగతి కనిపిస్తే రాష్ట్ర కార్యవర్గంలో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. అటు బొప్పరాజు వెంక‌టేశ్వర్లు ఆధ్వర్యంలోని ఏపీ జేఏసీ అమ‌రావ‌తి కూడా స‌బ్ క‌మిటీతో చ‌ర్చల ప‌ట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీల‌న్నీ త్వరిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని కోరామ‌న్నారు బొప్పరాజు.

ఇవి కూడా చదవండి

పీఆర్సీ బ‌కాయిలు ఇంకా 14వేల‌ 800 కోట్లు ఇవ్వాలన్నారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‎పై త్వరలోనే స్పష్టత ఇస్తామని చెప్పినట్లు బొప్పరాజు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందన్నారు.10 వేల మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1300 మందిని మాత్రమే చేశారని బొప్పరాజు చెప్పుకొచ్చారు. ఇక చ‌ర్చల ప్రారంభానికి ముందు స‌చివాల‌య సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి బొత్స, స‌జ్జల‌కు ఉద్యోగులు విన‌తిప‌త్రాలు అంద‌జేసారు. త‌మ‌కు రావ‌ల్సిన బ‌కాయిలు త్వర‌గా విడుద‌ల చేయాల‌ని వారు కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..