
తన అన్నను హత్యచేసిందనే ఆగ్రహంతో వదినను మరిది హత్య చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో సంచలనం కలిగించింది. ఆస్పరి మండలం తొగలుగల్లు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ మూడున తొగలుగల్లు గ్రామంలో అహోబిలం అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్యను అతని భార్య భార్య గంగావతి(26) ఆమె ప్రియుడు చెన్న బసవతో కలిసి హత్య చేసినట్లు ఆస్పరి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరినీ అదే నెల 8వ తేదీన అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే, అక్టోబర్ 18న గంగావతికి బెయిల్ వచ్చింది. అనంతరం వారం రోజులపాటు బంధువుల ఇళ్ళలో ఉన్న గంగావతి.. తన స్వగ్రామమైన తగలుగల్లుకు ఇటీవల వచ్చింది.. రేకుల షెడ్డులో పిల్లలతో కలిసి నివసిస్తోంది.
ఈ క్రమంలో తన అన్నను చంపిన వదిన గంగావతిపై మరిది గొల్ల పెద్దయ్య కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి గంగావతి పిల్లలు.. నిద్రించేందుకు తమ బంధువుల ఇంటికి వెళ్లారు. దీన్ని అదునుగా చేసుకున్న గొల్ల పెద్దయ్య ప్లాన్ రచించాడు.. గంగావతి నిద్రిస్తుండగా రేకుల షెడ్డు గడియ తీసి రోకలికట్టతో ఆమెపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.
ఆపై సోమవారం ఉదయం పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అహోబిలం గంగావతి దంపతులకు భరత్(7) వర్షిని(5) సంతానం. వివాహేతర సంబంధం కారణంగా కుటుంబం చిన్నాభిన్నం అయింది. తల్లిదండ్రులు ఇద్దరు ఊహించని విధంగా హత్యకు గురవడంతో పిల్లలు అనాధలు అయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..