
వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో రైతులు వ్యవసాయానికి ఉపక్రమిస్తోన్నారు. పొలం దున్నుకుంటూ.. విత్తనాలు వేసుకుంటూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.. ఇప్పటికే చాలా మంది రైతులు గత కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు విత్తనాలను విత్తారు.. చాలా ప్రాంతాల్లో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి.. అయితే.. అంతా బాగానే ఉన్నప్పటికీ- ఆర్థిక స్థోమత లేని రైతన్నలు మాత్రం ఎప్పట్లాగే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పుల మీద ఆధారపడుతూ సేద్యం చేస్తున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎద్దును కొనలేని ఓ పేద రైతు.. పొలం దున్నడానికి తన మనవాళ్ళను కాడెద్దుగా మార్చిన ఉదంతం కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. మనవళ్ల సాయంతో పొలం దున్నుకుంటున్న ఓ అన్నదాతకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
సాధారణంగా పొలాన్ని ఎద్దులతో దున్నుతారు. కానీ కర్నూలు జిల్లా గోనెగొండ్లకు చెందిన కౌలంట్లయ్య అనే రైతు సొంత మనవళ్ళనే కాదేద్దులుగా మార్చి పొలం దున్నాడు. కౌలుంట్లయ్యకు ఉన్న రెండేకరాల పొలంలో పత్తి పంట వేశాడు. కాడెద్దులతో పొలం దున్నేందుకు, రెండు వేల రూపాయలు బాడుగ అడిగారు. అంత డబ్బు ఇవ్వలేక, సొంత మనవళ్లనే కాడేద్దులుగా పెట్టుకొని పొలంలో కలుపు దున్నించాడు.
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కర్నూలుకు చెందిన సుశీల నేత్రాలయం అధినేత డాక్టర్ సుధాకర్ ఆ రైతుకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో P4 ప్రోగ్రాం క్రింద రైతు కౌలుంట్లయ్య కు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చెక్ ను అందజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..