ఎత్తయిన కొండలు, పెద్దపెద్ద లోయలు, గలగలపారే సెలయేళ్లు, ఎటుచూసినా పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రకృతి అందాల గురించి ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. మరోవైపు అబ్బురపరిచే మంచు మేఘాలు. దేవ లోకమే భువికి దిగొచ్చిందా అన్నట్టుగా అద్భుత దృశ్యాలు. ఎటుచూసినా ఎక్కడచూసినా కనువిందే. ఒక్క మాటలో చెప్పాలంటే అదో అద్భుత ప్రపంచం. అల్లూరి మన్యంలో ఏ మూలకు వెళ్లినా పరవశించిపోవడం ఖాయం. అంతలా ఉంటాయ్ అక్కడి ప్రకృతి అందాలు. అలాంటి ప్రకృతి అందాల మధ్య విపరీతంగా ఆకట్టుకుంటోంది ఓ జలపాతం. జి.మాడుగుల మండలం కొత్తపల్లి వాటర్ ఫాల్‌కి క్యూ కడుతున్నారు పర్యాటకులు.
వర్షాకాలం ముగిశాక కూడా కొత్తపల్లి జలపాతం గలగలపారుతూ అందర్నీ ఆకర్షిస్తోంది. తెల్లటి నురగలతో సరిగమలు పలికిస్తోంది కొత్తపల్లి జలపాతం. ఎత్తయిన కొండ పైనుంచి జాలువారుతోన్న సెలయేటి కింద జలకాలాడుతూ సేదతీరుతున్నారు టూరిస్టులు. ఆంధ్రా నయాగరా కింద స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగుతున్నారు.
తెలుగు స్టేట్స్ నుంచే కాకుండా, ఒడిషా నుంచి కూడా పెద్దఎత్తున కొత్తపల్లి వాటర్ ఫాల్‌కి తరలివస్తున్నారు పర్యాటకులు. ప్రకృతి అందాల మధ్య ఎంజాయ్ చేయడానికి క్యూ కడుతున్నారు. అద్భుత లోకంలో విహరిస్తున్నట్లు తన్మయత్వానికి గురవుతున్నారు. ఓవరాల్‌గా జలపాతం కింద జలకాలాడుతూ ప్రకృతి ప్రేమికులు మైమరిచిపోతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..