
రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వారి వ్యక్తిగత వివరాలను తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇందులో ఒకటి నాయకులు విద్యార్హతలు. రాజకీయ నాయకులు అనగానే బహిరంగ సభలు, చట్ట సభల్లో అనర్గళంగా మాట్లడడమే గుర్తొస్తుంది. ప్రతీ సబ్జెక్ట్ పై ఎంతో కొంత అవగాహన కలిగి ఉంటారు. దీనంతటికీ వారి విద్యార్హతలే కారణమా.? కచ్చితంగా అవునని మాత్రం సమాధానం చెప్పలేము. కొందరు నాయకులు విద్యార్హతలకు అతీతంగా, తమ అనుభవంతో అంశాలపై పరిజ్ఞానం సంపాదించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఆంధ్రప్రదేశ్ లో నాయకులు ఎంత వరకు చదువుకున్నారు.? అసలు ఎక్కడ చదువుకున్నారు..? వారి విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉంది. మూడుసార్లు ముఖ్యమంత్రిగానూ చేశారు. ఆయన 20 ఏప్రిల్ 1950న చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జన్మించారు. పదో తరగతి వరకూ చంద్రగిరిలో చదువుకున్నారు. వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజి తిరుపతిలో బీఏ చదివి.. ఆ తర్వాత ఎంఏ ఎకనామిక్స్‌ను శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీలో పూర్తి చేశారు. ఎంఏ పూర్తి చేసిన తర్వాత పీహెచ్ డీ చేయాలని స్టార్ట్ చేసినప్పటికీ మధ్యలోనే ఆపేశారు.
ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 21 డిసెంబర్ 1972 లో జన్మించారు. హైదరాబాద్‌లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఇంటర్ వరకూ చదువుకున్నారు. ఆ తర్వాత బీకాం డిగ్రీని హైదరాబాద్‌లో పూర్తి చేశారు. బీకాంలో.. ఇండియా ఇండస్ట్రియల్ ఎకానమి, అడ్వాన్స్ ఎకౌంటెన్సీ, కమర్షియల్ అండ్ ఇండియన్ లా, కంపెనీ లా అండ్ ఆడిట్, కాస్ట్ అకౌంటెన్సీ, ఇన్ కం టాక్స్ సబ్జెక్ట్ లతో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారు. బీకాం డిగ్రీలో ఇలాంటి సబ్జెక్టులతో పట్టా పొందిన వారు చాలా తక్కువమంది ఉంటారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2సెప్టెంబర్ 1971లో బాపట్లలో జన్మించారు. పవన్ విద్యార్హత చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం ఇంటర్మీడియట్ వరకూ మాత్రమే చదువుకుని అక్కడి నుంచి ఫుల్ స్టాప్ పెట్టేశారు. మాతృభాష తెలుగు కాబట్టి.. ఇంగ్లీష్ చదువులు, పాఠాలు చెప్పే గురువులు నాకు నచ్చకపోవడంతోనే చదువు మధ్యలో ఆసేసినట్లు పవన్ కళ్యాణ్ అనేక సందర్బాల్లో స్వయంగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీకి ఇటీవల అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి మాత్రం చైన్నై లో చదువుకున్నారు. పురంధేశ్వరి తండ్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినిమాల్లో నటిస్తూ చెన్నైలో ఉండటంతో అక్కడే చదువుకున్నారు. బీఏ లిటరేచర్ పూర్తిచేసిన తర్వాత డిప్లొమా ఇన్ జెమాలజీ పూర్తి చేశారు.
క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండానే రాజకీయాల్లో రాణిస్తున్న నేతలు ఎవరి క్వాలిఫికేషన్ ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం బాగానే రాణిస్తున్నారు నేతలు. అసెంబ్లీలోనే కాదు బహిరంగ సభల్లో కూడా దుమ్ము రేపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..