విజయవాడ లోక్‌సభ టీడీపీ టికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు కేశినేని చిన్ని. చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్లే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని.. ఈ విషయంలో నాని, చిన్ని అనే తేడా లేదని.. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచి తీరుతామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఏం చెబితే అది తూచా తప్పకుండా పాటించే సైనికులమని తెలిపారు కేశినేని చిన్ని. బెజవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య టీడీపీలో వార్ పీక్స్‌లో ఉన్న సమయంలో చిన్ని చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘చంద్రబాబు చెప్పినవాళ్లే విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారు. నాకు టికెట్ ఇస్తే నేను.. కేశినేని నానికి టికెట్ ఇస్తే ఆయన పోటీ చేస్తారు. అదృష్టాన్ని వదులుకునే పరిస్థితుల్లో ఎవరూ లేం. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచి తీరుతాం. చంద్రబాబు ఏం చెబితే అది తూచా పాటించే సైనికులం మాత్రమే’ అని చిన్ని చెప్పుకొచ్చారు. కాగా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎంపీ కేశినేని నాని– ఆయన తమ్ముడు కేశినేని శివనాధ్ అలియాస్ చిన్ని మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. లోక్‌సభ టికెట్‌కు సంబంధించి సోదరుల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో టీడీపీ అధిష్టానానికి, కేశినేని నానికి మధ్య దూరం పెరిగిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టికెట్ల విషయంలో టీడీపీ అధిష్టానం టికెట్ల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
కాగా కొంతకాలం వరకూ కేశినేని నానికి అనుకూలంగా ఉన్న తిరువూరు టీడీపీ ఇంచార్జి దేవదత్ ను కూడా ఎంపీకి దూరం చేసారని చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. తాజాగా తిరువూరు ఇంచార్జ్ దేవదత్ వేసిన డోర్ పోస్టర్లలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ తో పాటు స్థానిక ఎంపీ కేశినేని నాని ప్లేస్ లో చిన్ని ఫోటో ముద్రించడంతో వివాదాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. ఎంపీ స్థానంలో ఆయన తమ్ముడు ఫోటో ఉండటంపై నాని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రెండు రోజులకొకసారి ఏదో ఒక వ్యవహారంతో కేశినేని బ్రదర్స్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..