CM Chandrababu: కాశీబుగ్గ తొక్కిసలాటకు కారణం వాళ్లే.. వదిలిపెట్టం.. సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్..
కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఆలయాన్ని ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించారని, కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు వచ్చినా, నిర్వాహకులు కనీసం పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని స్పష్టం చేశారు. సమాచారం ఇచ్చి ఉంటే భద్రత ఏర్పాటు చేసేవాళ్లమని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. స్వామివారి దర్శనానికి వెళ్లిన అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ఆకాంక్షించారు. కాశీబుగ్గలో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర ఆలయం నిర్మించారని సీఎం తెలిపారు. కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారని వివరించారు.
ఆలయంలో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నా, నిర్వాహకులు కనీసం పోలీసులకు, అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. సమాచారం ఇచ్చి ఉంటే.. తగిన బందోబస్త్ ఏర్పాటు చేసేవాళ్లమని తెలిపారు. “ఒక్క ప్రాణం కూడా పోకూడదని ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుండగా, ప్రైవేటు కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుని అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం” అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ అనంతరం, ఈ తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
విచారణకు కమిటీ..
కాశీబుగ్గ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశాలతో కలెక్టర్ స్వప్నిల్ ముగ్గురు అధికారులతో కమిటీ వేశారు. టెక్కలి ఆర్డీవో, ఏఎస్పీతో పాటు దేవదాయశాఖ సహాయ కమిషనర్‌తో కమిటీ ఏర్పాటు చేశారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
వీడియో చూడండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
