‘రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చా..’ జగదీశ్వరరెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెల్లడి
రూ.25 కోట్ల ఆస్తిపై ఆశతో జగదీశ్వరరెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు నిందితుడు సాధిక్‌ఖాన్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. విషపదార్థాన్ని పలుమార్లు ఇచ్చినట్లు, అనంతరం సైనైడ్ పంపించినట్లు అతడు వెల్లడించినట్లు తెలుస్తోంది. సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలతో పోలీసులు విచారించడంతో నిందితుడు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. కేసులో విషపదార్థం నమూనాలను పోలీసులు సీజ్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు..

కాకినాడ, సెప్టెంబర్ 11: పంచాయతీరాజ్ ఏఈ టి నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించింది తానేనని నిందితుడు సాధిక్‌ఖాన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సాధిక్‌ను కోర్టు అనుమతితో కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు మూడు రోజులుగా విచారిస్తున్నారు. విచారణలో తొలి రెండు రోజులు తనకేమీ తెలియదని చెప్పిన సాధిక్.. పోలీసులు సాంకేతిక ఆధారాలను చూపడంతో పాటు సైనైడ్ విక్రయించిన వ్యక్తుల సాక్ష్యాల గురించి వెల్లడించడంతో చివరకు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది.
జగదీశ్వరరెడ్డిని హత్య చేయాలనే ఉద్దేశంతో విషపదార్థాన్ని ఒకసారి కొబ్బరి నీళ్లలో కలిపి ఇచ్చినట్లు సాధిక్ వెల్లడించినట్లు సమాచారం. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ మూడు, నాలుగు సార్లు విషపదార్థం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించి మృతి చెందుతాడని భావించినట్లు తెలిపాడు. అయితే జగదీశ్వరరెడ్డి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొంది కొంత కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా సాధిక్ సైనైడ్‌ను పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దాన్ని ఉపయోగించిన మరుసటి రోజే జగదీశ్వరరెడ్డి మృతి చెందినట్లు సాధిక్ విచారణలో వెల్లడించాడు.
రూ.25 కోట్ల ఆస్తిపై కన్ను?
జగదీశ్వరరెడ్డి భార్య సౌజన్యను వివాహం చేసుకుంటే ఆమె కుటుంబానికి చెందిన సుమారు రూ.25 కోట్ల విలువైన ఆస్తి తనకు దక్కుతుందని సాధిక్ భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమె తండ్రి వివాహానికి అంగీకరించలేదని, ఆస్తిని మనవడితో పాటు కుటుంబంలోని మరో వ్యక్తి పేరున రాస్తామని చెప్పడంతో వివాదం తలెత్తింది. ఈ విషయంలో తీవ్రంగా గొడవపడిన సాధిక్.. వారిని చంపేస్తానని బెదిరించాడు. అయితే వారు ఆత్మహత్య చేసుకుంటారని మాత్రం తాను ఊహించలేదని పోలీసుల ఎదుట వెల్లడించాడు. కేసు దర్యాప్తులో భాగంగా సాధిక్ ఉపయోగించినట్లు చెబుతున్న విషపదార్థం నమూనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, స్వాధీనం చేసుకున్న నమూనాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




