జనసేన 12వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా కొల్లిపర మండలం అత్తోట రైతు బాపారావు పార్టీపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. తన వ్యవసాయ భూమిలో మొక్కలతో జనసేన పార్టీ లోగో కనిపించేలా చేశాడు. ఆవిర్భావ దినోత్సవం రోజు అందరికి తెలిసేలా వాటిని ప్రదర్శించాడు. ప్రకృతి వ్యవసాయం చేసే బాపారావు జనసేన అభిమాని. ఈ ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న పార్టీపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకోవాలని ఈ విధంగా చేసినట్లు బాపారావు తెలిపాడు. జన సేన లోగోతో పాటు డిప్యూటీ సిఎం, 100 శాతం స్ట్రైక్ రేట్ అంటూ మొక్కలతోనే రూపొందించాడు. 2.5 ఎకరాల్లో ఎర్ర తోటకూర, జనుము విత్తనాలను ఒక క్రమ పద్దతిలో పెంచి లోగో ఆకృతిలు వచ్చేలా చేసినట్లు చెప్పాడు. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కల్యాణ్, చంద్రబాబుతో కలిసి పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు అతను చెబుతున్నాడు.
గతంలోనూ వినూత్నంగా బాపారావు మొక్కలతో పలు బొమ్మలు కనిపించేలా మొక్కలు పెంచాడు. వరి మొక్కలతో శంఖు, చక్ర నామాలు, కనకదుర్గమ్మ, గాంధీ ఆకారాలను తన వ్యవసాయ క్షేత్రంలో రూపొందించి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. వ్యవసాయంపై మక్కువ ఎక్కువ అని.. చేస్తున్న పనితోనే తనకు కిష్టమైన వారిపై అభిమానాన్ని చాటుకోవాలన్న సంకల్పంతో తాను ఈ విధంగా చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.