Janasena: సీఎంవి ఓటు బ్యాంకు పాలిటిక్స్.. అలజడి రేపేందుకే కాపులను అవమానిస్తున్నారంటూ జనసేన నేతలు ఆరోపణలు

|

Jul 31, 2022 | 9:48 AM

సమాజంలో అలజడి సృష్టించే విధంగా.. ఓటు బ్యాంకు రాజకీయాలను ముఖ్యమంత్రి చేస్తున్నారంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు చేశారు. కులాలను పక్కనపెట్టి, సమాజ అభ్యున్నతి కోసం అందరం కలిసికట్టుగా పోరాడుదామనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎం ఇష్టానుసారం మాట్లాడటం బాధాకరమని అన్నారు. 

Janasena: సీఎంవి ఓటు బ్యాంకు పాలిటిక్స్.. అలజడి రేపేందుకే కాపులను అవమానిస్తున్నారంటూ జనసేన నేతలు ఆరోపణలు
Nadendla Manohar
Follow us on

Janasena: కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కాపు నేస్తం ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం జగన్ కాపులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సీఎం కులాలను కలపాల్సిన బాధ్యతలను పూర్తిగా విస్మరించారు. సమాజంలో అలజడి సృష్టించే విధంగా.. ఓటు బ్యాంకు రాజకీయాలను ముఖ్యమంత్రి చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కులాలను పక్కనపెట్టి, సమాజ అభ్యున్నతి కోసం అందరం కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చే జనసేన అధినేతపై సీఎం ఇష్టానుసారం మాట్లాడటం బాధాకరమని అన్నారు.

పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కోలేక…

ఇవి కూడా చదవండి

వరదల్లో ప్రజలు పడుతున్న బాధలను పక్కనపెట్టి బాధ్యత విస్మరించిన సీఎం జగన్ రెడ్డి…  కాపు నేస్తం పథకం బటన్ నొక్కిన  3.38 లక్షల మందికి లబ్ధి కలిగిందని చెబుతున్నారు. ప్రభుత్వం వివిధ నిబంధనల పేరుతో ఎంతమందికి పథకం దూరం చేసిందో కూడా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని, ఏసీ, టీవీ, కారు, స్థలం ఉందంటూ రకరకాల కారణాలను చూపుతూ.. ఎంతో మందికి ప్రభుత్వం సంక్షేమ పథకం ఫలాలు ప్రభుత్వం దూరం చేసిందని పేర్కొన్నారు. ఓ సామాజిక వర్గ ఓట్లు పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా ఉన్నాయనే అక్కసుతో సీఎం ఈ విధంగా మాట్లాడుతున్నారని నాదెండ్ల చెప్పారు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కొలేని ముఖ్యమంత్రి కేవలం వ్యక్తిగత విమర్శలు చేసి ఆనందం పొందుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఎంతకు అమ్మడుపోయి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు మనోహర్.

ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా?
ప్రజలకు మేలు చేయమంటే ప్రతిసారీ బటన్ నొక్కాను.. బటన్ నొక్కాను అని సీఎం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని.. అది రోబోలు చేసే పని అంటూ వ్యాఖ్యానించారు. బటన్ నొక్కడం కోసమా ప్రజలు మంచి మెజారిటీతో మిమ్మిల్ని ఎన్నుకున్నదని ప్రశ్నించారు. అసలు ఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా? అధికారంలో లేకున్నా పవన్ కళ్యాణ్ గారు రైతులకు భరోసా ఇచ్చేందుకు ముందుకు రావడం మానవత్వం. యువతకు దారి చూపాలని ఆలోచించడం మానవత్వం. కష్టాల్లో ఉన్న వారికి స్వాంతన కలిగించేలా, వారి సమస్యలను సావధానంగా వినడం మానవత్వం. ఎలాంటి మానవత్వం లేకుండా పాలన చేసే సీఎం ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ని విమర్శించడం సిగ్గుచేటన్నారు.

అమలాపురం అల్లర్ల వెనుక ఎవరు ఉన్నది ప్రజలు గమనించారు
అమలాపురం అల్లర్ల వెనుక ఎవరు ఉన్నది రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నారని.. అన్ని విషయాలు బయటపడుతున్న వేళ.. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేయాలనే మార్గాన్ని ఎంచుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ మంత్రులను పవన్ కళ్యాణ్ మీద పదేపదే విమర్శలు చేయించి.. మీ అవసరం తీరాక వారిని పక్కకు నెట్టేశారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారని చెప్పారు. జనసేన అధినేతపై విమర్శలు చేస్తూ.. మీ విలువైన సమయం వృథా చేసుకోకుండా, పాలన మీద దృష్టి పెట్టండని సూచించారు. అధికార పార్టీ సీఎం, నేతలు, ప్రజాప్రతినిధులు జనసేనానిపై ఎన్ని బూటకపు మాటలు, విమర్శలు చేసినా ప్రజలంతా జనసేనకు అండగా ఉంటారు అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..