కాపుల రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. 85 ఏళ్ల వయస్సులో ఆయన దీక్ష చేపట్టడంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని జనసేనాని పవన్‌కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. హరిరామజోగయ్య ఆమరణ దీక్షపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రికి ఫోన్ చేసి పరామర్శించారు పవన్. అలాగే వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ‘హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉంది. ఆయన వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్చలు జరిపేందుకు చొరవ చూపాలి’ అని పవన్ డిమాండ్ చేశారు. మరోవైపు ఏలూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హరిరామజోగయ్యకు షుగర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. వైద్యం అందించేందుకు డాక్టర్లు ప్రయత్నించినా ఆయన నిరాకరిస్తున్నారు.
మరోవైపు హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు పోలీసులు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. వెంటనే వైద్యం అందించాలని, అందుకు సహకరించేలా ఒప్పించాలని తెలిపారు. అయితే పోలీసుల తీరుపై సూర్యప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమం ఆస్పత్రికి తీసుకెళ్తామని తన తండ్రిని ప్రభుత్వాస్పత్రిలో ఆస్పత్రిలో ఉంచడం ఏంటని అధికారులను ప్రశ్నించారు చేగొండి సూర్యప్రకాశ్. మరోవైపు ఆస్పత్రి లోపలికి వెళ్తున్న టీడీపీ, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం నుంచి నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు హరిరామజోగయ్య. అయితే ఆదివారం రాత్రి పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..