
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ చేపట్టే పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. రేపు (శుక్రవారం) విశాఖలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పీఎం తో భేటీ కానున్నారని సమాచారం. రాష్ట్రంలోని రాజకీయాలు, శాంతి భద్రతలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా విశాఖ లో జరిగిన పరిణామాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ పాలన, జనసేనకు టీడీపీ మద్దతు ఈ అంశాలపై ప్రకటన చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలన్న బీజేపీ ప్రయత్నాలకు విశాఖ నుంచే ముందడుగు పడనుందా అనేది వేచి చూడాలి. కాగా.. ప్రధాని మోదీ రేపు (శుక్రవారం) సాయంత్రం విశాఖపట్నం చేరుకుంటారు. మదురై విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు విశాఖకు వస్తారు. రాత్రికి చోళ షూట్ లో బస చేస్తారు. 12 తేదీ ఉదయం చోళ షూట్ నుంచి ఆంధ్రా యూనివర్శిటీకి చేరుకుని అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ప్రధాని రాక సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లాలకు చెందిన పోలీసులను విశాఖకు రప్పిస్తున్నారు. విశాఖకు వచ్చే అన్ని కీలకమైన పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా అధికారులు ఆంక్షలు విధించారు. డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 5 కి.మీ పరిధిలో డ్రోన్లు ఎగరవేయొద్దరి వార్నింగ్ ఇచ్చారు. గురువారం నుంచి ఆదివారం వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..