ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ సంక్షేమ పథకాల పరంపర కొనసాగుతుంది. గడిచిన నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల నీరాజనాల కోసం ఏదో ఒక సంక్షేమ పథకం ప్రవేశపెడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాలను పలు పథకాల ద్వారా ఆర్థికంగా ఆదుకుంటున్నారు.. ఇలా అన్ని వర్గాలు తమవారేనని.. ఇది పేదల ప్రభుత్వం అంటూ చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారని సీఎం జగన్ చెబుతున్నారు. అంతే కాదు మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చామని కూడా సీఎం జగన్ చెబుతున్నారు. ఇక ఎన్నికలకు ముందు మిగిలిన ఒకట్రెండు కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే కాకుండా మేనిఫెస్టోలో హామీఇవ్వని పథకాలు కూడా అమలు చేశామని సీఎం జగన్ చెబుతున్నారు. వచ్చే జనవరి నుంచి సామాజిక పెన్షనలను 3 వేల రూపాయలకు పెంచి ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇలా తమ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న సివిల్స్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం అమల్లోకి తెచ్చారు.
జగనన్న సివిల్స్ ప్రోత్సాహక పథకం ప్రవేశపెడుతూ విధివిధానాలతో జీవో ఎంఎస్ 58 ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు ఈ పథకం వర్తిస్తుంది. సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్దులకు వారు మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. ఇక మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు ఇంటర్వ్యూలకు అవసరమైన కోచింగ్, ఇతర అవసరాల కోసం 50 వేల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం.. అయితే పథకానికి ఎలాంటి అర్హతలుండాలనే దానిపై జీవోలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన, ఈబీసీ వర్గాలకు పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..