పైకి మిత్రపక్షాలుగా చెప్పుకుంటున్నప్పటికీ జనసేన, బీజేపీ మధ్య బంధం అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వంపై పోరాటాల విషయంలోనూ ఎక్కడా రెండు పార్టీలు కలిసిన దాఖలాలు లేవు. నాకు ఢిల్లీ పెద్దలు తప్ప రాష్ట్రంలో బీజేపీ నాయకులు పెద్దగా పరిచయం లేదంటూ పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారు. దీంతో ఈ రెండు పార్టీల స్నేహం అంతంతమాత్రంగానే ఉండేది. ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జనసేనకు పిలుపు ఉంటుందా లేదా అనే అనుమానానికి ఫుల్ స్టాప్ పడింది. ఎన్డీయే భేటీకి తమకు ఆహ్వానం అందిందంటూ జనసేన పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. బీజేపీతో దోస్తీ ఉన్నప్పటికీ ప్రధాని మోదీతో పవన్ కలిసింది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే.
ఎన్డీయే భేటీకి జనసేన హాజరైతే ఈ రెండు పార్టీల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. పవన్ ఢిల్లీ పర్యటనతో రాష్ట్రంలో కూడా కలిసి ఎలా ముందుకు వెళ్ళేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యనే రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి రావడం, ఎన్డీయే భేటీకి పవన్ హాజరవుతూ ఉండటంతో రాష్ట్రంలో రాజకీయంగా కీలక పరిణామాలు ఉండే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీతో కలసి ముందుకెళ్లడం, పొత్తుల విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..