Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్ధుల కోసం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది సర్కార్.. ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్ధులు సర్టిఫికెట్ల కోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా డిజిటల్ విధానంలో సర్టిఫికెట్లు ఉంచింది. ఫలితాలు విడుదలై సర్టిఫికెట్లు ముద్రణ ఇంకా పూర్తికాకపోవడం, విద్యార్ధులకు చేరడంలో ఈ ఏడాది జాప్యం జరిగింది. అయితే ఈలోగా పలు ఉన్నత విద్యా కోర్సులకు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ఇంటర్ విద్యామండలి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ యాప్ డిజిలాకర్‌లో ఇంటర్ పాస్ సర్టిఫికెట్లతో పాటు పలు రకాల సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచింది. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ వివరాలు అందించారు.
ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్‌తో పాటు మైగ్రేషన్ సర్టిఫికెట్ సహా మరికొన్ని సర్టిఫికెట్లను డిజిలాకర్‌లో అందుబాటులోకి ఉంచింది. 2014 నుంచి 2023 ఏడాది వరకూ చదువు పూర్తి చేసుకున్న విద్యార్ధులకు సంబంధించిన సర్టిఫికెట్లు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. విద్యార్ధులు వారి అవసరాల కోసం డిజిలాకర్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రవాణా శాఖకు సంబంధించి పలు కార్డుల స్థానంలో డిజిలాకర్‌లో డిజిటల్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. తాజాగా ఇంటర్ సర్టిఫికెట్లను కూడా డిజిలాకర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్ధుల సంఖ్యను పెంచడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో పెంచడం ద్వారా ఎక్కువ మంది విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రభుత్వం ద్వారా అందే పథకాలను విస్తృతంగా ఉపయోగించుకునేలా సౌకర్యాలు కల్పిస్తుంది. తాజాగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్ధుల కోసం మరో చక్కటి అవకాశాన్ని తీసుకొచ్చింది. వాస్తవంగా ఇంటర్మీడియట్ రెండేళ్లు పూర్తి చేసుకున్నవారు ఏవైనా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే ఆయా సబ్జెక్ట్ లను తిరిగి సప్లిమెంటరీ విధానంలో రాసుకుని పాస్ కావల్సి ఉంటుంది. అలాంటి వారి సర్టిఫికెట్లపై సప్లిమెంటరీ లేదా జూన్-జూలై లో పాస్ అయినట్లు సర్టిఫికెట్లు ఇస్తారు.
ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చింది సర్కార్. ఇంటర్ ఫెయిలైన విద్యార్దులు తిరిగి కొత్తగా అడ్మిషన్ తీసుకుని అన్ని పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు ఆయా విద్యార్ధులు కాలేజీకి వెళ్లి చదువుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఈ విద్యార్ధులు తిరిగి పరీక్షలు రాసినప్పుడు ఎప్పుడు ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణనలోకి తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేయనుంది. అంతేకాదు రెగ్యులర్ విద్యార్ధులకు ప్రభుత్వం నుంచి వర్తిస్తున్న అన్ని పథకాల మాదిరిగానే జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద పథకాలు కూడా వర్తిస్తాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..