Andhra Pradesh: స్టార్ హీరో విక్రమ్ నటించిన సూపర్ హిట్ సినిమా అపరిచితుడు చాలా మందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో తప్పులు, పాపాలు చేసే కొందరికీ హీరో వైరటీ శిక్ష విధిస్తూ ఉంటాడు. వాళ్లు చేసిన తప్పులను బట్టి శిక్ష డిసైడ్ చేసి దాన్ని అమలు చేస్తూ ఉంటాడు. ఆ శిక్షలకు వెరైటీ పేర్లు కూడా పెడతాడు. వాస్తవానికి ఆ శిక్షలన్నీ గరుడ పురాణంలో పేర్కొన్నవే. ఏయే తప్పులకు ఏ శిక్షలు విధిస్తారనేది గరుడపురాణంలో (Garudapurana) ఉంది. తాజాగా ఇలాంటి శిక్షలు ఏపీలో (Andhra Pradesh) విద్యార్థులపై అమలవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేమి హాస్టల్ విద్యార్థుల (Hostel Students) ప్రాణాలు మీదకు తెస్తున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం బాలికల హాస్టల్‌లో చోటుచేసుకున్న ఘటన విద్యార్థుల్లో కలకలం సృష్టించింది. బాలికలకు వడ్డించిన ఉప్మాలో చనిపోయిన కప్ప కనిపించింది. విద్యార్థినులు ఉప్మా తింటున్న సమయంలో ప్లేటులో చనిపోయిన కప్పను విద్యార్థినులు చూశారు. తాము తిన్న ఉప్మాలో కప్ప చనిపోయిందని తెలిసి చాలా మంది బాలికలకు వికారం మొదలైంది. ఈ విషయాన్ని వెంటనే వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వచ్చిన కిచెన్ పరిశీలించి వంటలు శుభ్రంగా వండకపోతే ఇంటికి పంపిస్తానని వంట మాస్టర్లను హెచ్చరించి చేతులు దులుపుకున్నారు. వారం క్రితం కూడా ఇలాంటి సంఘటనే హాస్టల్‌లో చోటుచేసుకుంది. కఠిన చర్యలు తీసుకుంటామని అప్పుడు అధికారులు హామీ ఇచ్చారు.
రాజమండ్రి హాస్టల్‌లో కప్ప ఘటన మరవకముందే కడప యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులకు వడ్డించిన ఆహారంలో మరో కప్ప ప్రత్యక్షమైంది. విద్యార్థులకు వడ్డించిన పాయసంలో కప్ప కనిపించింది. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వడ్డించిన ఉప్మాలో కప్ప వచ్చినా అక్కడ విద్యార్ధినులు సైలెంట్‌గా ఉండిపోయారు. కాని యోగి వేమన విశ్వవిద్యాలయంలో అంతా బాయ్సే ఉండటంతో వాళ్లంతా నిరసనకు దిగారు. యూనివర్సిటీ ముందు ఆందోళన చేపట్టారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని వాళ్లు చెప్తున్నారు. ప్రిన్సిపల్ దృష్టికి విషయం తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. వేల రూపాయలు ఫీజులు తమతో కట్టించుకొని ఇలాంటి భోజనాన్ని వడ్డించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..