AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.. బహుమతులు గెలుచుకోండి.. పోలీసుల వినూత్న ఆఫర్..

Andhra Pradesh: మహిళల భద్రతకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ యాప్ ను మహిళలకు మరింత చేరువ చేసేందుకు ప్రకాశం జిల్లా ఎస్‌పి మలిక..

Andhra Pradesh: ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.. బహుమతులు గెలుచుకోండి.. పోలీసుల వినూత్న ఆఫర్..
Prakasam Sp
Shiva Prajapati
|

Updated on: Feb 08, 2022 | 9:24 PM

Share

Andhra Pradesh: మహిళల భద్రతకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ యాప్ ను మహిళలకు మరింత చేరువ చేసేందుకు ప్రకాశం జిల్లా ఎస్‌పి మలిక గార్గ్‌ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్ లక్కీ డ్రా కాంటెస్ట్ ప్రారంభించి విజేతలుగా నిలిచిన 21 మంది మహిళలు, విద్యార్థులకు బహుమతులను జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు. గత వారంలో అత్యధికంగా 459 మంది మహిళలతో దిశ యాప్ ను డౌన్ లోడ్ చేయించి.. దాని వినియోగం గురించి వివరించిన మార్కాపురానికి చెందిన మహిళా పోలీస్‌ జయ కమల ను ప్రత్యేకంగా అభినందించి, బహుమతి మరియు ప్రశంసాపత్రం అందజేశారు. జిల్లా ఎస్పీ ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమంతో గత వారం రోజులుగా ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే దిశ యాప్ డౌన్ లోడ్స్ లో ప్రథమ స్థానంలో నిలిచింది. గత వారం రోజులలో జిల్లాలో అత్యధికంగా 13,945 మహిళలు కొత్తగా దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్నారు. ఇలా దిశయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న మహిళలతో సంబంధిత అంశాలు, మహిళా భద్రతపై, మహిళలపై జరుగుతున్న నేరాలు, దిశ యాప్ ఉపయోగం, వినియోగం గురించి ఎస్‌పి చర్చించారు. క్షేత్ర స్థాయిలో మహిళా భద్రత మరింత పెంచడం గురించి వారి అభిప్రాయాలు, ఆలోచనలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.

లక్కీడ్రా విజేతలతో సమావేశం.. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న మహిళల జాబితాలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలుగా నిలిచిన మహిళలు, వారి కుటుంబ సభ్యులతో ఎస్పీ మలిక గార్గ్‌ సమావేశం నిర్వహించారు. ఆపద, సమస్య ఉన్న సమయంలో రక్షణ పొందేందుకు దిశ యాప్‌లో ఉన్న SOS బటన్ నొక్కితే ఫోన్ నెంబర్, చిరునామా, లొకేషన్‌తో సహా వాయిస్ పది సెకన్లు రికార్డు అవుతుందని, ఈ సమాచారం దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తక్షణం చేరుతుందని ఎస్పీ తెలిపారు. తద్వారా పోలీసులు వెనువెంటనే సహాయం అందిస్తారని తెలియచేశారు. ఒకవేళ బాధిత మహిళ ఫోన్‌కు స్పందించకపోతే జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా బాదితులు ఉన్న లొకేషన్‌కు పోలీసులు చేరుకుంటారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు చాలా మంది మహిళలను వివిధ ఆపదల నుండి కాపాడడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అందరూ దిశ యాప్‌పై అవగాహన కలిగి ఉండి అత్యవసర సమయాల్లో దిశ యాప్ ను తప్పనిసరిగా ఉపయోగించుకొని రక్షణ పొందాలని సూచించారు. మహిళల భద్రత, రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. మహిళా భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారన్నారు.

జిల్లాలో దిశ పోలీసు స్టేషన్ పనితీరు మరింత మెరుగుపరుస్తున్నామని, మహిళలపై వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిర్ణీత గడువులోగా దోషులకు శిక్ష పడేలా చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులు తమ పరిధి కానప్పటికీ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నామని అన్నారు. మహిళా ఫిర్యాదులను వెంటనే స్వీకరించడానికి ప్రతి పోలీసు స్టేషన్‌లో ప్రత్యేకంగా ఉమెన్ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసి మహిళా సిబ్బందిని నియమించామని వివరించారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో మహిళలు, విద్యార్థినులకు ఈవ్ టీజింగ్, వేధింపులు వంటి ఆపదల నుండి తక్షణ రక్షణ కల్పించడానికి దిశ పెట్రోలింగ్ వాహనాలు ద్వారా సిబ్బంది నిరంతర బీట్స్ నిర్వహిస్తున్నారని, పోలీసు స్టేషన్ కు వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నవారు నేరుగా గ్రామ/వార్డ్ సచివాలయలలోని మహిళా పోలీసులకు పిర్యాదు చెయ్యవచ్చని తెలిపారు. మహిళా పోలీసులు తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ప్రతి మహిళ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి అత్యవసర సమయాల్లో యాప్‌ను వినియోగించడంపై అవగాహన కల్పించటంతో తరచుగా పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి దిశ యాప్‌పై బాలికలకు, విధ్యార్దినులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారని ఎస్‌పి తెలిపారు.

ఇక ఈ లక్కీ డ్రా కాంటెస్ట్ లో దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటున్న మహిళలలో రోజుకి ముగ్గురిని చొప్పున 21 మందిని ఎంపిక చేశారు. వారికి ప్రకాశం పోలీసు, దిశ లోగో మరియు విజేత పేరు ముద్రించిన ఆకర్షణీయమైన బహుమతులను అందించారు. విజేతలతో కలిసి ఎస్‌పి తేనీరు సేవించి విజేతలందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డి చౌడేశ్వరి , దిశ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ డిఎస్‌ఫి మల్లికార్జున రావు , డిఎస్‌బి డిఎస్‌పి మరియదాసు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Also read:

Bank Jobs 2022: బ్యాంక్‌ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? నైనిటాల్ బ్యాంక్‌లో100 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. వెంటనే..

Nandita Swetha: ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు.. నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Viral Photo: తగ్గేదేలే.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరు గ్రేటే.. గుర్తిస్తే మీవి డేగ కళ్లే.!