Andhra Pradesh: కనిగిరి బాలుడి ఆచూకీ లభ్యం.. ఆ విషయంలో దొరికిపోవద్దనే కిడ్నాప్ చేసిందట..!

|

Feb 10, 2022 | 3:49 PM

Andhra Pradesh: ప్రకాశం జిల్లా కనిగిరిలో 9 నెలల బాలుడి కిడ్నాప్‌ కేసు సుఖాంతమైంది. బాలుడు అపహరణకు గురైనట్టు ఫిర్యాదు అందిన 6 గంటల్లోనే పోలీసులు బాలుడ్ని కనిపెట్టి..

Andhra Pradesh: కనిగిరి బాలుడి ఆచూకీ లభ్యం.. ఆ విషయంలో దొరికిపోవద్దనే కిడ్నాప్ చేసిందట..!
Baby Boy
Follow us on

Andhra Pradesh: ప్రకాశం జిల్లా కనిగిరిలో 9 నెలల బాలుడి కిడ్నాప్‌ కేసు సుఖాంతమైంది. బాలుడు అపహరణకు గురైనట్టు ఫిర్యాదు అందిన 6 గంటల్లోనే పోలీసులు బాలుడ్ని కనిపెట్టి సంరక్షణలోకి తీసుకున్నారు. అనంతరం.. బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాలుడి కిడ్నాప్‌ ఉదంతానికి హ్యాపి ఎండింగ్‌ పడింది. అయితే, ఈ కిడ్నాప్ కేసు అచ్చం సినిమాని తలపించింది. అక్రమ సంబంధాన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు గుంజేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో.. బాలుడిని కిడ్నాప్ చేసింది ఓ కిలాడీ లేడీ. నిందిత మహిళ కారణంగా ఈ కిడ్నాప్‌లో మరో ఇద్దరు బలవ్వాల్సి వచ్చింది.

వివరాల్లోకెళితే.. అర్దరాత్రి ఒంటి గంట సమయంలో గుంటూరు జిల్లా నెమలికల్లు గ్రామంలోని ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. గాఢ నిద్రలో ఉన్న ఓ దంపతులను నిద్ర లేపారు. వారిపక్కనే పడుకుని ఉన్న బాలుడ్ని ఆద్యంతం పరిశీలించారు. తమ వెంట తెచ్చుకున్న బాలుడి ఫోటోతో సరిపోల్చారు. ఫోటోలోని బాలుడు, తాము తనిఖీలు చేసిన నెమలికల్లులోని ఇంట్లో ఉన్న బాలుడు ఒక్కరేనని నిర్ధారించుకున్నారు. వెంటనే బాలుడ్ని సంరక్షణలోకి తీసుకుని ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇక ప్రకాశం జిల్లా కనిగిరిలోని కాశిరెడ్డి కాలనీకి చెందిన 9 నెలల బాలుడు నిన్న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అపహరణకు గురయ్యాడు. కాశిరెడ్డి కాలనీకి చెందిన దుర్గ, గణేష్ లు తమ బాబు కనపడటం లేదని కనిగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాశి రెడ్డి కాలనీలో ఉన్న మహిళలు ప్రతిరోజు గుండీలు ఆటలు ఆడుకుంటూ ఒకే చోట ఉండటంతో దుర్గ తన తొమ్మిది నెలల వంశీని తన స్నేహితురాలైన స్నేహలతకు అప్పజెప్పి ఆటలో కూర్చుని ఉండిపోయింది. గంట తర్వాత వెళ్లి చూస్తే బాబు కనిపించకపోవడంతో తన కొడుకు ఏడి అని నిలదీసింది. నాకేం తెలీదు అని చెప్పడంతో దుర్గ వెంటనే కనిగిరి పోలీసులను ఆశ్రయించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రామిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన స్నేహితురాలు తన బాబుని తీసుకొని తిరిగి ఇవ్వడం లేదంటూ తనకు న్యాయం చేయాలని బాలుడి తల్లి వేడుకుంది. దీంతో స్నేహలతను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బాబుని తనకు తెలిసిన మరో మహిళ సుధకు ఇచ్చానని స్నేహలత చెప్పడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలుడ్ని ఎత్తుకెళ్ళిన సుధ కోసం గాలించారు. సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా దుర్గ గుంటూరు జిల్లా నెమలికల్లు గ్రామంలో ఉన్నట్టు గుర్తించారు. ఆలస్యం చేయకుండా వెంటనే నెమలికల్లు గ్రామానికి చేరుకుని సుధ ఉంటున్న ఇంట్లో సోదాలు చేశారు. దాంతో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభించింది. పోలీసులు ఆ దంపతులను తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం వెలుగు చూసింది.

సినిమాను మించిన స్టోరీ..
నిందితురాలు సుధ.. గోపి రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే, ఈ అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఒకసారి గర్భవతిని అయ్యానని, మరోసారి ప్రసవం అయిందనీ చెబుతూ పలుమార్లు గోపి రెడ్డి దగ్గర సుధ డబ్బులు వసూలు చేసింది. దాంతో బిడ్డను చూపించాలని గోపిరెడ్డి పట్టుబట్టడంతో కిడ్నాప్ వ్యవహారానికి తెరలేపింది. కనిగిరిలో ఓ మహిళ సాయంతో బాలుడిని కిడ్నాప్ చేసి అమరావతి దగ్గర నెమలికల్లు గ్రామానికి తీసుకెళ్లింది సుధ. కాగా, నెమలికల్లులో సుధ ఇంటిపై కనిగిరి ఎస్‌ఐ రామిరెడ్డి తన సిబ్బందితో కలిసి దాడి చేసి బాలుని సంరక్షించారు. గోపిరెడ్డి, సుధలతో పాటు కిడ్నాప్ చేయడానికి సహకరించిన మరో మహిళ స్నేహలతను అదుపులోకి తీసుకున్నారు. బాలుడ్ని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఫిర్యాదు అందిన ఆరుగంటల్లోనే కేసును ఛేధించి బాలుడ్ని సురక్షితంగా అప్పగించడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Also read:

UP Election 2022: మీ వెంట మేమున్నాం.. ముస్లిం మహిళల పోరాటంపై ప్రధాని మోడీ ప్రశంసలు..

Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ పోస్టులు.. నెలకు రూ. 70 వేలకుపైగా జీతం..

Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు మంచి జ్ఞాపక శక్తి, తెలివితేటలు గలవారు.. అందులో మీరున్నారా తెలుసుకోండి..