Andhra Pradesh: గ్రామాన్నే వణికిస్తున్న రౌడీ కోతి.. కనిపిస్తే చాలు అటాక్ చేసేస్తుంది..
Andhra Pradesh: ఉన్నది ఒక్కటే కోతి, కానీ ఊరు మొత్తాన్ని ముప్పుతిప్పులు పెడుతోంది. కనిపించిన వాళ్లందరిపైనా ఎటాక్ చేస్తూ చుక్కలు చూపిస్తోంది.
Andhra Pradesh: ఉన్నది ఒక్కటే కోతి, కానీ ఊరు మొత్తాన్ని ముప్పుతిప్పులు పెడుతోంది. కనిపించిన వాళ్లందరిపైనా ఎటాక్ చేస్తూ చుక్కలు చూపిస్తోంది. అవును, కాకినాడ జిల్లాను పెద్ద పులి హడలెత్తిస్తుంటే, పక్కనే ఉన్న కోనసీమ జిల్లాలో కోతి బెంబేలెత్తిస్తోంది. పులి కనిపించి కనిపించకుండా ముప్పుతిప్పలు పెడుతుంటే, ఈ కోతి మాత్రం అందరి కళ్ల ముందే తిరుగుతూ చుక్కలు చూపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు పీకి పందిరేస్తోంది. చిక్కడు దొరకడు అన్నట్టుగా గ్రామంలోనే తిరుగుతూ అందరినీ హడలెత్తిస్తోంది. పెద్ద పులి ఎలా బోనుకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతుందో, సేమ్ టు సేమ్ అలాగే ఈ కోతి ముప్పుతిప్పులు పెడుతోంది. కనిపించిన వాళ్లందరిపైనా ఎటాక్ చేస్తూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
మండపేట మండలం గాంధీనగర్ గ్రామంలో ఈ కోతి హల్‌చల్ కొనసాగుతోంది. తనకు ఎదురే లేదన్నట్టుగా చెలరేగిపోతోంది. పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మరింత రెచ్చిపోయి ఎటాక్ చేసి క్షణాల్లో పారిపోతోంది. కోతి దాడిలో ఇప్పటికే పలువురు గాయపడ్డారు. బూరుగుంట చెరువు పార్క్‌లో జనాలపై విరుచుకుపడటంతో పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఇక, లేటెస్ట్‌గా యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. తన పదునైన పళ్లతో యువకుడి రెండు చేతులను కొరికేసింది కోతి.
తీవ్ర గాయాలపాలైన బాధితుడు శ్రీనును ప్రభుత్వాస్పత్రికి తరలించారు స్థానికులు. అయితే, కోతి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని హడలిపోతున్నారు గ్రామస్తులు. ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు.. కోతి భయంతో వణికిపోతున్నారు. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న కోతిని పట్టుకోవాలంటున్నారు గాంధీనగర్ గ్రామస్తులు. మరొకరిపై దాడి చేయకముందే దాన్ని బంధించి తీసుకెళ్లాలని అధికారులను వేడుకుంటున్నారు.