Heavy Rains in AP: ఏపీలో వర్షాలు బీభత్సం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. తిరుమల ఘాట్‌పై కూలిన కొండచరియలు..
Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరాన్ని తాకడంతో వానలు, ఈదురుగాలుల..

Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరాన్ని తాకడంతో వానలు, ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. తూర్పుగోదావరిజిల్లా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. అంతేకాదు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు తిరుపతిలోనూ కుంభవృష్టి వర్షం పడుతోంది. భారీ వర్షాల కారణంగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో తిరుమల వెళ్లే దారిని అధికారులు మూసివేసినట్లు తెలుస్తోంది. శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధురానగర్‌తోపాటు చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ లోని భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. బాధితులకు తక్షణ ఆర్ధిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బలమైన గాలులు వీస్తుండటంతో విద్యుత్ శాఖ అప్రమత్తం అయింది. ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. ముందు జాగ్రత్త చర్యలపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరా తీశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల అధికారులతో SPDCL- CMD హరనాథ్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి.
వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో 19.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు లో 19 సెంటిమీటర్ల వర్షపాతం , తడలో 18.9 సెంటిమీటర్ల వర్షపాతం, వాకాడులో 18.2, నాయుడు పేటలో 15 సెంటిమీటర్లు నమోదు సత్యవేడులో 15.5 సెంటిమీటర్లు, వడమాలపేటలో 15.1సెంటిమీటర్ల వర్షపాతం, పుత్తూరులో 10 సెంటిమీటర్లు వర్ష పాతం నమోదయ్యింది. ఇక తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో 6.1 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కడప జిల్లా చిట్వేలు లో 4.8 సెంటిమీటర్ల వర్షపాతం, రాయచోటిలో 2.2 సెంటిమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 2.1 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఒంగోలు, ఉలవపాడులలో 1.5 సెంటిమీటర్ వర్షపాతం మచిలీపట్నంలో 1.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతారణశాఖ అధికారులు తెలిపారు.
Also Read: కార్తీక పౌర్ణమిరోజున పాక్షిక చంద్రగ్రహణం.. మనదేశంలో ఎక్కడ కనిపించనున్నదంటే..