AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీ గదులు వదిలి.. ఎండలో చెత్త తొలగింపు.. పర్యావరణ పరిరక్షణకు నడుంకట్టిన టెకీలు

ఆఫీస్‌లోని ఒత్తిడి నుంచి రిలీఫ్‌ కోసం పార్టీలు, పబ్బులకు వెళ్లే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులనే చూసి ఉంటారు. కానీ ఇక్కడో కంపెనీ ఉద్యోగులు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఆలోచించారు. మానసిక ఒత్తిడికి చెక్ పెట్టేందుకు పర్యావరణ పరిరక్షణకు నడుంకట్టారు HCL కంపెనీ ఉద్యోగులు. అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా 140 మంది ఉద్యోగులు కొత్తపట్నం బీచ్‌లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, సముద్ర జీవుల రక్షణకు కృషి చేశారు.

ఏసీ గదులు వదిలి.. ఎండలో చెత్త తొలగింపు.. పర్యావరణ పరిరక్షణకు నడుంకట్టిన టెకీలు
Hcl Techies Clean Prakasam Beach
Fairoz Baig
| Edited By: |

Updated on: Sep 20, 2026 | 1:50 PM

Share

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అంటే విలాసవంతమైన జీవితం, లక్షల్లో జీతం అనుకుంటుంటాం.. అయితే ఆ ఉద్యోగాలు చేసే వారి మానసిక ఒత్తిడి గురించి తెలుసుకుంటే ఎవరికైనా దిమ్మతిరిగిపోద్ది. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా జీతం బాగానే ఉన్నా ఒత్తిడి తట్టుకునేందుకు వీకెండ్ పార్టీలు, హాలిడే ట్రిప్పులతో టెకీలు సేదతీరుతుంటారు. అయితే ఇటీవల కాలంలో పర్యావరణంపై అవేర్‌నెస్‌ పెరిగిపోవడంతో టెకీలు జాలీ ట్రిప్‌లతో పాటు పర్యావరణ హితంగా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమకు మానసిక ఉల్లాసంతో పాటు పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేసే విధంగా వీకెండ్ ట్రిప్‌లు ఎంచుకుంటున్నారు.

తాజాగా ఇలానే హెచ్‌సీఎల్ ఉద్యోగులు తమ ఆలోచనలకు పదును పెట్టారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్‌కు 140 మంది టెకీలు తరలివచ్చి.. తీరంలో పేరుకుపోయిన చెత్తను సేకరించి శుభ్రం చేశారు. అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నంలోని కె. పల్లెపాలెం తీరంలో శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. హెచ్‌సీఎల్ కంపెనీకి చెందిన 140 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, స్థానికులతో కలిసి తీరప్రాంత శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.

తీరం వెంబడి పడేసిన చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించి డంపింగ్‌ యార్డ్‌కు తరలించారు.. సముద్రంలో మత్స్యకారులు వేట సాగించే సమయంలో తెగిపోయిన ప్లాస్టిక్ వలల్లో చిక్కుకుని సముద్ర తాబేళ్లు, ఇతర సముద్ర జీవులు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో తీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవశ్యకతను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వివరించారు. అలాగే సముద్రంలో కలుస్తున్న ఇతర వ్యర్థాల కారణంగా కాలుష్యం పెరిగి సముద్ర జీవుల ఉనికికి ముప్పు తలెత్తుతోందని సందర్శకులకు అవగాహన కల్పించారు.

దీన్ని నివారించేందుకు బీచ్‌లకు వచ్చే పర్యాటకులు తీరాన్ని కలుషితం చేయకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు… ఇకపై నెలకోసారి తీరంలో స్వచ్ఛ కార్యక్రమాలు చేపడతామని, అందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండల ఎంపీడీవో శ్రీకృష్ణ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us