
కాపుల కురువృద్ధుడు.. కాపుల కోసం కాపు కాసే నేతగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు హరిరామజోగయ్య. నిన్నమొన్నటి వరకు పవన్‌కు వరుస లేఖలతో సలహాలిచ్చిన.. హరిరామజోగయ్య, తాను అధ్యక్షుడిగా ఉన్న కాపు సంక్షేమ సేనను తాత్కాలికంగా రద్దు చేశారు. కాపు సంక్షేమ సేన ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఇన్నేళ్లు ఎలా నడిపాం, ఏమేం చేశామని వివరిస్తూ.. లేఖ విడుదల చేశారు హరిరామజోగయ్య. ముద్రగడ పద్మనాభం కాపు సంక్షేమ పోరాటం నుంచి విరమించుకున్న దశలో తాను కాపు సంక్షేమ సేనను ఏర్పాటు చేశానని.. దీని ద్వారా కాపు రిజర్వేషన్లు కోసం పోరాడంతో పాటు.. న్యాయ పోరాటం చేస్తున్నానని వివరించారు. తన కొడుకు రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదన్నారు హరిరామ జోగయ్య. కాపులను యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకురావటానికి ప్రయత్నించానే తప్ప.. తన స్వలాభం కోసం ఎన్నడూ చూసుకోలేదన్నారు. కానీ.. తనను పవన్ కల్యాణ్, జనసేన కార్యకర్తలు సహా అందరూ అపార్థం చేసుకున్నారని, కొందరు అమర్యాదగా మాట్లాడారని.. లేఖలో పేర్కొన్నారు.
ప్రజారాజ్యం కోసం తాను ఎంపీ పదవిని సైతం వదులుకుని పార్టీలో చేరానని గుర్తు చేశారు హరిరామజోగయ్య. కానీ.. చిరంజీవి ప్రజారాజ్యం తీసుకెళ్లి కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా.. తనతో సహా కాపులు నష్టపోయారని చెప్పారు. ఇలాంటి పరిస్థితి.. మళ్లీ ఇప్పుడు రావొద్దన్నదే.. తన ఆవేదన అన్నారు హరిరామ జోగయ్య. అందుకే తాత్కాలికంగా రాజకీయంగా తప్పుకుంటున్నానని చెప్పారు. కాపు సంక్షేమ సేనలో అన్ని కార్యవర్గాలు, అనుబంధ సంఘాలు, వివిధ వ్యక్తుల హోదాలు రద్దవుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలయ్యాక.. కొత్త కమిటీలను ఏర్పాటు చేసి.. కార్యాచరణ రూపొందిస్తానని.. అప్పటివరకు తాను రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగుతా అన్నారు హరిరామజోగయ్య. అయితే ఈ లేఖ చివరిలోనూ.. ఆయన ఓ ట్విస్ట్ ఇచ్చారు. జనసేన ఇలా నడుచుకోవాలి, పొత్తులో అధికారం శాసించే స్థాయిలో ఉండాలంటూ.. నెల రోజులుగా.. వరుస లేఖలు రాసిన హరిరామ జోగయ్య.. ఇదే చివరి లేఖ అంటూ ప్రతి లెటర్ రిలీజ్ చేసే ముందు చెప్పుకొచ్చారు. చివరి లేఖ అన్న తర్వాత కూడా మరో నాలుగు లేఖలు రాశారు. తాజాగా రాసిన లేఖలో రాజకీయంగా తప్పుకుంటానని, విశ్లేషకుడిగా ఉంటానంటూనే.. పవన్ కల్యాణ్‌కు సలహాలు, సూచనలు కొనసాగుతాయనే హింట్ ఇచ్చారు.
వదల బొమ్మాలి, వదల అన్నట్లు, పవన్‌కు ఏ పరిస్థితిల్లో అయినా సలహాలు కొనసాగుతాయంటున్నారు హరిరామజోగయ్య. అయితే.. తనకు సలహాలు ఇవ్వొద్దని హరిరామజోగయ్య పేరు తియ్యకుండా.. ఇండైరెక్ట్‌గా.. ఇటీవల ఓ సభలో చెప్పారు పవన్.
పవన్ పరోక్ష వ్యాఖ్యల తర్వాత కూడా.. టీడీపీ-జనసేన జయహో బీసీ పేరుతో సభ జరిపాక.. బీసీ డిక్లరేషన్ సరే, కాపుల డిక్లరేషన్ ఎప్పుడంటూ.. ఈ నెల 6 లేఖ రాశారు హరిరామజోగయ్య. 52శాతం ఉన్న బీసీలకు 10 అంశాలతో డిక్లరేషన్ ప్రకటిస్తే.. జనాభాలో 25శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఒకవైపు.. వద్దు మహాప్రభో అంటూ.. పవన్ చేతులెత్తి మొక్కుతున్నా.. మరోవైపు కాపునేత హరిరామజోగయ్య మాత్రం.. లేఖాస్త్రాలు సంధించడం ఇప్పట్లో ఆగేలా లేదు. రాజకీయంగా తప్పుకుంటానని చెప్తున్నా, విశ్లేషకుడిగా.. పవన్‌కు సలహాలిస్తూనే ఉంటాననడం.. సరికొత్త ట్విస్ట్‌గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..