Andhra Pradesh: పైకి వారంతా యాచకులే.. తీరా యవ్వారం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో కనిపించకుండాపోయిన ఆరేళ్ల బాలుడి కేసును గుంటూ రైల్వే పోలీసులు ఛేదించారు. పక్కా సమాచారంతో అనుమానితులను అనుసరించిన పోలీసులు, కిడ్నాపర్ల గుట్టురట్టు చేశారు. నర్సరావుపేట పరిసర ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యులు గల లేడీ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాలుడిని సురక్షితంగా తల్లికి అప్పగించారు.
![Andhra Pradesh: పైకి వారంతా యాచకులే.. తీరా యవ్వారం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/lady-kidnappers.jpg?w=1280)
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్.. అస్సాం నుండి వచ్చిన సచితా బేగం తన కొడుకు ఆరేళ్ల సకీబుద్దిన్‌తో కలిసి ప్లాట్‌ఫాంపై నిద్ర పోయింది. అయితే నిద్రలేచి చూసేసరికి సకీబుద్దిన్ కనిపించలేదు. దీంతో సెంట్రల్ రైల్వే స్టేషన్ చుట్టపక్కల అంతా గాలించింది. కొడుకు జాడ కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.
జనవరి పన్నెండో తేదిన సకీబుద్దిన్ అదృశ్యం అయ్యాడు. సకీబుద్దిన్ మిస్పింగ్‌పై వ్యాసర్పడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా విజువల్స్‌ను పరిశీలించారు. దాదాపు పది రోజుల తర్వాత సకీబుద్దిన్ ఎలా మాయమయ్యాడో గుర్తంచారు పోలీసులు. యాచక వృత్తిలో ఉన్న మహిళలు బాలుడిని తీసుకెళ్లినట్లు నిర్ధారించారు. అయితే ఆ మహిళలు ఎక్కడి వాళ్లు ఆ బాలుడిని ఎక్కడి తీసుకెళ్లార్న అంశంపై చెన్నై పోలీసులకు ఆధారాలు దొరకలేదు.
యాచన చేసుకుంటూ రైళ్లలో ప్రయాణించే మహిళలే బాలుడిని ఎత్తుకెల్లినట్లు ఎట్టకేలకు గుర్తించారు. ఆతర్వాత వారి ఫోటోలను సేకరించి సెంట్రల్ రైల్వే జోన్ తోపాటు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్స్ కు ఐదుగురు మహిళల ఫోటోలను పంపించారు. ఎక్కడైన తారసపడితే వివరాలు చెప్పాలని వ్యాసర్పడి పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడిని కిడ్నాప్ చేసిన అంజమ్మ, ఉమ, సరస్వతి, సత్యవతి, వీరాంజమ్మలు నర్సరావుపేట పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలుగా గుర్తించారు. వారికి అనుమానం రాకుండా జనవరి 26వ తేదిని బాలుడిని తీసుకుని వెలుతుండగా ఫాలో అయిన పోలీసులు అందరిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని చెన్నై తరలించినట్లు స్థానిక రైల్వే పోలీసులు చెప్పారు. అయితే గతంలో వీరు చిన్నారులను అపహారించుకుని వెళ్లే ప్రయత్నం చేసినట్లు అనుమానాలున్నాయి. దీంతో పూర్తి స్థాయిలో ఈ మహిళా ముఠాపై నిఘా పెట్టిన రైల్వే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..