టవర్ ఎక్కి నిరసన… బ్రతిమలాడి కిందకు దించిన పోలీసులు.. ప్రాబ్లం ఏంటంటే..?

నిర్మాణ పనులకు నీరు లేకపోవడంతో కోటేశ్వరావు ఇబ్బందులు పడుతున్నాడు. ఒక్కో ట్యాంకర్‌ను 600 నుండి 1000 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అటు కనెక్షన్ రాకపోవడం ఇటు నిర్మాణ పనులకు అధికంగా ఖర్చు చేయాల్సి రావటంతో కోటేశ్వరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయాన్నే శ్రీనగర్ కాలనీకి వెళ్లి.. అక్కడున్న సెల్ టవర్ ఎక్కాడు.

టవర్ ఎక్కి నిరసన... బ్రతిమలాడి కిందకు దించిన పోలీసులు.. ప్రాబ్లం ఏంటంటే..?
Cell Tower

Edited By:

Updated on: Feb 16, 2024 | 11:46 AM

గుంటూరు, ఫిబ్రవరి 16: తన సమస్య పరిష్కారం కోసం వినూత్న రీతిలో నిరసన తెలిపాడు గుంటూరు నగరవాసి. తాగునీటి కుళాయి కావాలంటూ సచివాలయంతో పాటు కార్పోరేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో ఆవేదనకు లోనయ్యాడు. ఏం చేయాలో తెలియక వినూత్న నిరసనకు దిగాడు. తన సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో గాని పోలీసులు మాత్రం అతన్ని స్టేషన్ తరలించారు. వివరాల్లోకి వెళ్తే..  గుంటూరులోని శారదా కాలనీ… పదహారో లైన్‌లో నివాసం ఉండే కోటేశ్వరావు కూలీ పనులు చేసుకొని జీవిస్తుంటాడు. అయితే తను అద్దెకు ఉంటూ సమీపంలోని సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇంటికి అద్దెకుంటున్న ఇంటి నుండి మున్సిపల్ ట్యాప్ ద్వారా నీటి కనెక్షన్ కోసం పెట్టకుంటున్నాడు. ఈ క్రమంలోనే పక్క ఇంటి వారికి కోటేశ్వరావుకు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో కోటేశ్వరావు తాను నిర్మాణం చేసుకుంటున్న ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే నిర్మాణంలో ఉన్న ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని కార్పోరేషన్ అధికారులు తేల్చి చెప్పారు. అప్పటి నుండి కోటేశ్వరావు సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు.

నిర్మాణ పనులకు నీరు లేకపోవడంతో కోటేశ్వరావు ఇబ్బందులు పడుతున్నాడు. ఒక్కో ట్యాంకర్‌ను 600 నుండి 1000 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అటు కనెక్షన్ రాకపోవడం ఇటు నిర్మాణ పనులకు అధికంగా ఖర్చు చేయాల్సి రావటంతో కోటేశ్వరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయాన్నే శ్రీనగర్ కాలనీకి వెళ్లి.. అక్కడున్న సెల్ టవర్ ఎక్కాడు. దీంతో చుట్టు పక్కల వాళ్లు అతన్ని వారించే ప్రయత్నం చేశారు. అయినా తనకు మంచి నీటి కనెక్షన్ ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ టవర్ పైకి ఎక్కాడు.

దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు టవర్ వద్దకు వచ్చారు. అదే సమయంలో మున్సిపల్ అధికారులకు అక్కడికి చేరుకున్నారు. తాగునీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని కిందకు దిగిరావాలంటూ రిక్వెస్ట్ చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో కోటేశ్వరావు కిందకు దిగి వచ్చాడు. కోటేశ్వరావు కిందకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..