చేబ్రోలు, డిసెంబర్ 27: గుంటూరు జిల్లాలో మొట్టమొదటి పిండమార్పిడిలో గిర్‌జాతి కోడె దూడ జన్మించింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుంటూరు అనీల్ కుమార్‌రెడ్డికి చెందిన జెర్సీ ఆవుకు పిండమార్పిడి ద్వారా గిర్‌జాతి కోడెదూడకు జన్మనిచ్చింది. గిర్‌జాతికి చెందిన పిండాన్ని ఈ ఏడాది మార్చి 13వ తేదీన జెర్సీ ఆవు గర్భంలో ప్రవేశపెట్టారు. తాజాగా నెలలు నిండిన ఆ జెర్సీ ఆవు డిసెంబర్ 22న గిర్‌జాతికి చెందిన కోడెదూడకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో శ్రీనివాసరావు, లాం ఫాం పశుపరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎం. ముత్తారావు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈవో డి. బాలశంకరరావు తదితర బృందం గిర్‌జాతి కోడెదూడను పరిశీలించారు.
సీఈవో ఎం శ్రీనివాసరావు మీడియా సమావేశంలో విలేకర్లతో మాట్లాడుతూ.. పిండ మార్పిడి ద్వారా మేలు రకం జాతి లక్షణాలు ఉన్న సంతతితో పాటు, అంతరించి పోతున్న దేశవాళీ జాతులను కూడా వృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 145 పిండాలను మార్పిడి చేయగా 45 వరకు చూడి దశలో ఉన్నాయని తెలిపారు. దీనిపై భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 కోట్లు కేటాయించినట్టు వివరించారు. వచ్చే ఏడాది వంద దూడలు లక్ష్యంగా పెట్టుకున్నామని, అరుదైన పశువుల జాతులను కాపాడటం కోసం భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తామని తెలిపారు.
పిండ మార్పిడి విధానంలో పశువులు, ఆవులు గర్భం దాల్చడం వంటి ప్రయోగాలు ఇప్పటి వరకు పరిశోధనశాలలు, ఫామ్స్‌లలో మాత్రమే ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆ దశదాటిన పరిశోధనలు క్షేత్రస్థాయిలో సైతం సత్ఫలితాలు ఇచ్చేలా ప్రయోగాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రయోగాల కోసం కృషి చేసిన ఏడీ సాంబశివరావును సీఈవో ఎం శ్రీనివాసరావు, శాస్త్రవేత్త ముత్తారావు, ఉన్నతాధికారులు సన్మానించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.