హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు.. ఆపి చెక్ చేసేందుకు వెళ్లిన పోలీసులు.. అంతలోనే ఊహించని ట్విస్ట్
అమరావతి - అనంతపురం హైవేపై ఓ కారు వేగంగా దూసుకొస్తోంది.. అదే సమయంలో హైవేపై పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.. అది గమనించిన ఆ కారు డ్రైవర్ ఎందుకో కంగారు పడ్డాడు.. వెంటనే కారు ఆపేశాడు.. అది చూసిన పోలీసులు అతని కారును తనిఖీ చేసేందుకు దగ్గరకు వచ్చారు.. అంతలోనే ఆవ్యక్తి పోలీసులను ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతకు అతను పోలీసులు చూసి ఎందుకు కంగారు పడ్డాడు, ఎందుకు పారిపోయాడో తెలుసుకుందాం పదండి.

చోరీకి గురైన ఓ కారు అమరావతి – అనంతపురం రహదారిపై వస్తోందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ కారును కనిపెట్టేందుకు హైవేపై నాకాబందీ నిర్వహించారు పోలీసులు. అదే సమయంలో అటుగా దూసుకొచ్చిన ఆ కారు.. హైవేపై పోలీసులను చూసి ఆగింది.. అయితే ఆ తనిఖీలు తాను చోరీ చేసి తీసుకొస్తున్న కారు గురించే అని గ్రహించిన ఆ దొంగ కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు.. కారును ఆపేందుకు వచ్చిన కానిస్టేబుల్‌ను ఢీకొట్టి మరీ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్న కానిస్టేబుల్ అతని కాలర్ పట్టుకోవడంతో కారుతో సహా ముందుకు ఈడ్చుకుని వెళ్ళాడు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆ కానిస్టేబుల్ డ్రైవర్ కాలర్ విడిచిపెట్టకపోవడంతో భయంతో కారును నిలిపివేసి దొంగ పరారయ్యాడు.. ఈ ఘటనలో ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశంజిల్లా గిద్దలూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లిలో కారు చోరీ చేసి తీసుకెళుతున్న దొంగను అడ్డుకునే ప్రయత్నంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఓ కారును చోరీ చేసి దొంగ పరారు అవుతున్నాడని డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే జాతీయ రహదారిపై విధులలో ఉన్న కానిస్టేబుల్ నాయబ్ రసూల్ దొంగ కారును పరారు అవుతుండడాన్ని గుర్తించాడు. దొంగ మొదట పోలీసులను చూసి కారు నిలిపాడు. తర్వాత కారుతో కానిస్టేబుల్ ని ఢీ కొట్టి కారుతో పరారయ్యేందుకు ప్రయత్నించాడు.
కానిస్టేబుల్ నాయబ్ రసూల్ డ్రైవింగ్ సీటులో ఉన్న కారుడ్రైవర్ కాలర్ పట్టుకుని నిలువరించేందుకు ప్రయత్నించాడు.. అయితే కారు డ్రైవర్ వేగంగా కారును ముందుకు పోనిచ్చినా కానిస్టేబుల్ బెదరలేదు.. డ్రైవర్ చొక్కా పట్టుకుని అలాగే వెంట పడటంతో కారును నిలిచి కానిస్టేబుల్‌ను నెట్టేసి డ్రైవర్ పరారయ్యాడు.. ఈ ఘటనలో కింద పడిపోయిన కానిస్టేబుల్ నాయబ్ రసూల్‌కు గాయాలయ్యాయి.. కారును అక్కడే వదిలి దొంగ పరారయ్యాడు. కానిస్టేబుల్ నాయబ్ రసూల్ కు తీవ్ర గాయాలు కావడంతో అతనిని గిద్దలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారైన దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
