AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భవిష్యత్ యుద్ధాలు కొత్త రూపంలో వస్తాయి.. సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్

భవిష్యత్ యుద్ధాలు సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా సైబర్ దాడులు, డ్రోన్లు, ఏఐ ఆధారిత హైబ్రిడ్ ముప్పుల రూపంలో వచ్చే అవకాశముందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో పెరుగుతున్న వ్యూహాత్మక పోటీ నేపథ్యంలో భారత నౌకాదళం సాంకేతికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. స్వదేశీ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి కమిషనింగ్ దేశ రక్షణ స్వావలంబనకు మరో మైలురాయని పేర్కొన్నారు.

భవిష్యత్ యుద్ధాలు కొత్త రూపంలో వస్తాయి.. సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్
INS Mahendragiri,
Ram Naramaneni
|

Updated on: Jul 11, 2026 | 10:05 AM

Share

విశాఖపట్నం: భవిష్యత్‌లో ఎదురయ్యే శత్రువులు, యుద్ధాలు ఇప్పటివరకు చూసిన వాటిలా ఉండవని, సరికొత్త రూపంలో సవాళ్లు ఎదురవుతాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా భారత నౌకాదళం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌక కమిషనింగ్ కార్యక్రమానికి ముందు శుక్రవారం విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్ కేంద్రంలో నిర్వహించిన ‘బరాఖానా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పోటీ తీవ్రంగా పెరుగుతోందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో బయటి దేశాల ఉనికి పెరుగుతోందని, పలు శక్తులు తమ ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో భారత నౌకాదళంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.

యుద్ధ స్వరూపం మారుతోంది

రాబోయే రోజులు సులభంగా ఉండబోవని, రక్షణ రంగంలో ఎదురయ్యే సవాళ్లు మరింత సంక్లిష్టంగా మారతాయని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గతంలోలాగా యుద్ధాలు అధికారికంగా ప్రకటించి ప్రారంభమయ్యే పరిస్థితి ఉండకపోవచ్చని, యుద్ధ ప్రకటన లేకుండానే ఘర్షణలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. నేటి శత్రువు, రేపటి శత్రువు ఒకే విధంగా ఉండరని, కొత్త తరహా ప్రమాదాలకు దేశం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

హైబ్రిడ్ యుద్ధాలపై అప్రమత్తత అవసరం

భవిష్యత్‌లో సంప్రదాయ యుద్ధాలతో పాటు సైబర్ దాడులు, డ్రోన్ స్వార్మ్‌లు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత దాడులు, ప్రభుత్వేతర శక్తుల నుంచి వచ్చే ముప్పులు పెరిగే అవకాశముందని రక్షణ మంత్రి తెలిపారు. అందువల్ల భారత నౌకాదళం సముద్ర భద్రతతో పాటు సాంకేతిక ఆధారిత ముప్పులను ముందుగానే గుర్తించి సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

హిందూ మహాసముద్రం మన బాధ్యత

భారత్ వాణిజ్యంలో 90 శాతానికి పైగా సరుకు రవాణా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుందని, చమురు, సహజవాయువు వంటి కీలక దిగుమతులు కూడా ఇదే మార్గంలో వస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. దేశ ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్), ద్వీప ప్రాంతాలు, సముద్రంలోని ఇంధన వనరుల రక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు.

“హిందూ మహాసముద్ర ప్రాంతం మన పెరడు లాంటిది. ఆ పెరడును కాపాడటం మన బాధ్యత” అని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడే ప్రధాన దేశంగా భారత్ వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.

ఎంత సాధన ఉంటే.. అంత తక్కువ నష్టం

యుద్ధ సమయంలో నష్టాలు తగ్గాలంటే శాంతి కాలంలోనే కఠిన శిక్షణ, నిరంతర సాధన అవసరమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. “సాధన ఎంత ఎక్కువగా ఉంటే యుద్ధ సమయంలో త్యాగాలు, నష్టాలు అంత తక్కువగా ఉంటాయి” అని చెప్పారు. సైనికులు శారీరకంగానే కాకుండా మానసికంగానూ, సాంకేతికంగానూ ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి స్వావలంబనకు నిదర్శనం

శనివారం విశాఖలో భారత నౌకాదళంలో చేరనున్న స్వదేశీ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి దేశ రక్షణ రంగంలో మరో మైలురాయిగా నిలుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రాజెక్ట్-17ఏ కింద ముంబైలోని మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ నిర్మించిన ఈ యుద్ధనౌక భారత్ స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

భారత సాయుధ దళాలకు అత్యుత్తమ ఆయుధాలు, సాంకేతికత, వనరులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అయితే యుద్ధాల్లో కేవలం ఆయుధాలు మాత్రమే విజయాన్ని సాధించవని, వాటిని వినియోగించే సైనికుల ధైర్యం, నైపుణ్యం, అంకితభావమే విజయాన్ని నిర్ణయిస్తాయని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

Follow Us