AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో పేపర్ లీక్‌ కలకలకం.. రంగంలోకి కాక్రోచ్‌లు!

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌ యవ్వారం దేశ వ్యాప్తంగా ఎంత హీట్‌ పుట్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. నీట్‌ వ్యవహారం పూర్తిగా సర్దుమనక ముందే ఇప్పుడు మరో పేపర్‌ లీక్‌ ఇంకో రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన 14వ కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్ష, JSSC-CGL సహా పలు నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర విద్యార్థులు చేపట్టిన ఆందోళన తారా స్థాయికి చేరింది..

మరో పేపర్ లీక్‌ కలకలకం.. రంగంలోకి కాక్రోచ్‌లు!
Paper Leak In Jharkhand
Srilakshmi C
|

Updated on: Aug 03, 2026 | 2:42 PM

Share

రాంచీ, ఆగస్ట్ 3: ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్ధుల ధర్నా ఐదవ రోజుకు చేరింది. విద్యార్ధుల నిరసనకు వందలాది మంది విద్యార్థులు ఆదివారం సాయంత్రం భారీ టార్చ్‌లైట్ ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించకపోతే జార్ఖండ్ అసెంబ్లీని ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి.. JPSC, JSSC పరీక్షల్లో అక్రమాలపై CBI స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. అవేంటంటే..

  • JPSC, JSSC నిర్వహించిన నియామక పరీక్షలపై సీబీఐతో విచారణ చేపట్టాలి.
  • 14వ JPSC కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలి.
  • రాష్ట్ర నియామక సంస్థల్లో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలి.
  • కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)తో స్వతంత్ర విచారణ జరపాలి.
  • OMR షీట్లలో Not Attempted అనే ఐదో ఆప్షన్‌ను ప్రవేశపెట్టాలి.

‘CID విచారణపై నమ్మకం లేదు’

గతంలో కూడా పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈసారి అభ్యర్థుల OMR షీట్లు కూడా లీక్ అయ్యాయని JPSC అభ్యర్థి రాహుల్ కుమార్ క్రాంతి ఆరోపించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సీఐడీ విచారణకు ఆదేశించినప్పటికీ తమకు దానిపై నమ్మకం లేదని తెలిపారు. గతంలో JSSC-CGL పేపర్ లీక్ కేసులో కూడా సరైన చర్యలు తీసుకోలేదని, ఈసారి కూడా విచారణను కొంతకాలం తర్వాత పక్కన పెట్టే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. గత ఏడేళ్లలో JPSC, JSSC నిర్వహించిన అన్ని నియామక పరీక్షలపై సీబీఐ విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అవినీతి కారణంగా ప్రమాదంలో పడిందని మరో అభ్యర్ధి గిరిడిహ్ జిల్లాకు చెందిన అంకిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమలో చాలామంది రైతు కుటుంబాల నుంచి వచ్చామని, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు పొందే అవకాశం మాత్రమే కోరుకుంటున్నామని తెలిపారు. 2023 నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని, సమాన అవకాశాలు లేకపోతే ఉద్యోగం ఎలా సాధిస్తామని రాంచీకి చెందిన గిరిజన విద్యార్థిని స్నేహ ప్రశ్నించారు. తమ డిమాండ్లను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కాక్రోచ్‌ జనతా పార్టీ మద్దతు

అయితే ఝార్ఖండ్‌ విద్యార్థుల నిరసనకు అనూహ్యంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి మద్దతు లభిస్తోంది. వీరి నిరసనకు వివిధ నగరాల నుంచి ప్రజలు ఆహార పదార్థాలు పంపిస్తూ తమకు సహాయం చేస్తున్నారని విద్యార్ధులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని విద్యార్ధి నాయకుడు మహతో అన్నారు. జూలై 29న ప్రారంభమైన ఈ నిరసన ఉద్యమం రోజురోజుకు విస్తరిస్తోంది. పరీక్షా పత్రాల లీకులు, నియామకాల్లో అక్రమాల ఆరోపణలతో తమ ఏళ్ల తరబడి చేసిన శ్రమ వృథా అవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్ధులకు న్యాయం జరగడం కోసం మహతో నిరవదిక నిరాహార దీక్షకు దిగారు.

ఇక విద్యార్ధుల ఆందోళనలకు కాక్రోచ్ జనతాపార్టీ (CJP) మద్దతు ప్రకటించడంతో వీరి ఉద్యమానికి ఊపందుకుంది. నిరసనకారులకు తాము అండగా ఉంటామని, వారి డిమాండ్లకు తమ మద్దతు ఉంటుంది అని అభిజీత్ దీప్కే ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. కాగా JPSC పరీక్ష ఫలితాలు జులై 2వ తేదీన విడుదలయ్యాయి. జులై 5 నుంచి విద్యార్ధులు నిరసన చేపట్టారు. ఆ తర్వాత జులై 20న ముఖ్యమంత్రిని కలిసి, పేపర్‌ లీక్‌పై విద్యార్ధులు ఆధారాలను సమర్పించారు. వారాల తరబడి నిరసనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మహతో నిరాహార దీక్షకు దిగారు. విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం, జేపీఎస్‌సీ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, యువత నిరుత్సాహానికి గురవుతున్నారు. వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నానని ఆయన ప్రకటించారు.

Follow Us