జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర లో మూడు రోజుల పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం అంటే 15 తేదీన హైదరాబద్ నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అదే రోజు విశాఖపట్నం అర్బన్, రూరల్ పరిధిలోని జనసేన నాయకులతో పార్టీ ప్రణాళికలు, అమలు అంశాలపై సమావేశమవుతారు. 16 వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల నుంచి సమస్యలపై వచ్చే అర్జీలను స్వయంగా ఆయన స్వీకరించి, సమస్యల గురించి తెలుసుకుంటారు. 16 వ తేదీ సాయంత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.17వ తేదీ ఉదయం విలేకర్ల సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం బీచ్ రోడ్డులోని వై.ఎమ్.సీ.ఏ. హాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశమై దిశా నిర్దేశం చేస్తారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల గురించి స్వయంగా అడిగి తెలుసుకోవడం కోసం జనవాణి కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లోని ప్రజల దగ్గరకు వెళ్తూ స్వయంగా వారి సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా మళ్లీ జనసేనాని జనంలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.
15, 16, 17 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ జనసేన భవిష్యత్తు కార్యాచరణ పై పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 15 తేదీన పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటన, 16న ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమం, 17 తేదీలో శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమీక్ష జరుగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.