AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటాయనకు సుస్తి.. కుటుంబానికి పోషించేందుకు భర్త వృత్తిని చేపట్టిన భార్య..

భర్త అనారోగ్యంతో కుటుంబం కుదేలైన వేళ… గృహిణిగా ఉన్న శ్రీలక్ష్మి జీవితమే మారిపోయింది. కూలీ పనులతో ప్రారంభించిన ఆమె, చివరికి భర్త వృత్తినే ఆయుధంగా మార్చుకుని బైక్ మెకానిక్‌గా నిలదొక్కుకుంది. సమాజం వ్యంగ్యాలు పట్టించుకోకుండా కష్టంతో ముందుకు సాగి, ఇప్పుడు కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ ఇతర మహిళలకు స్ఫూర్తిగా మారింది.

ఇంటాయనకు సుస్తి.. కుటుంబానికి పోషించేందుకు భర్త వృత్తిని చేపట్టిన భార్య..
Woman Mechanic
M Sivakumar
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 12:48 PM

Share

ఓ చిన్న కుటుంబం, ఏ చీకుచింత లేని జీవితం… కానీ ఒక్కసారిగా పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి… భర్త బైక్ రిపేర్ చేసి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఇటీవల అతనికి వెన్నెముక సంబంధిత సమస్య తలెత్తి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో భార్యే అతని వృత్తి చేపట్టాల్సి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి జీవితం ఒక సాధారణ గృహిణిగా సాగేది. భర్త గ్యారేజ్‌లో బైక్ రిపేర్లు చేస్తూ కుటుంబాన్ని చూసుకునేవారు. అయితే ఒక్కసారిగా భర్తకు వెన్నెముక సంబంధిత తీవ్రమైన సమస్య రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శస్త్రచికిత్స తర్వాత ఆయన మంచానికే పరిమితమయ్యారు. ఇంటి బాధ్యతలన్నీ ఒక్కసారిగా శ్రీలక్ష్మి భుజాలపై పడ్డాయి. కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి మొదట ఆమె రోజువారీ కూలీ పనులు చేసింది. కానీ ఆ ఆదాయం భర్త చికిత్స ఖర్చులు, ఇంటి అవసరాలకు సరిపోకపోవడంతో కొత్త మార్గం గురించి ఆలోచించింది. చివరికి భర్త వృత్తినే తన బలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది.

గ్యారేజ్‌లో భర్త పని చేసే విధానాన్ని గమనిస్తూ.. చిన్నచిన్న పనులతో ప్రారంభించింది. మొదట్లో కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడినా ఆమె వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగింది… నెలల వ్యవధిలోనే బైక్ రిపేరింగ్‌లో మంచి పట్టు సాధించింది. ఇంజిన్ ఆయిల్ మార్చడం నుంచి ఇతర మెకానికల్ సమస్యలు పరిష్కరించడం వరకు అన్ని పనులు నేర్చుకుని పురుషులకు ఏమాత్రం తీసిపోనని నిరూపించింది.

భర్త ప్రోత్సాహం.. తన కష్టం కలిసి శ్రీలక్ష్మిని నేడు ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఆమె గ్యారేజ్‌లో బైక్‌లను రిపేర్ చేస్తూ కుటుంబాన్ని నిలకడగా నడిపిస్తోంది. తాను మొదట్నుంచి ఇంటి పనులు మాత్రమే చేసుకునే మహిళని… కానీ పరిస్థితులు మారడంతో నేర్చుకోవాల్సి వచ్చిందని అంటుంది.. కష్టపడితే ఏ పనైనా సాధ్యమే అని చెబుతోంది. అదే సమయంలో మహిళలకు ఒక సందేశం కూడా ఇస్తోంది.. కుటుంబ సభ్యుల సపోర్ట్.. మనపై మనకు నమ్మకం ఉంటే ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లవచ్చని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.

శ్రీలక్ష్మి కృషిని గుర్తించిన జిల్లా అధికారులు ఆమెకు శిక్షణ అవకాశాలు కల్పించారు. మరింత ఆధునిక సాంకేతికతను నేర్చుకునే అవకాశం కూడా లభించింది. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి చిన్న స్థలం కేటాయిస్తే.. సొంత గ్యారేజ్ ఏర్పాటు చేసి స్థిరంగా జీవనం సాగించాలనే ఆశతో ఉన్నారు శ్రీలక్ష్మి దంపతులు.

Also Read: ప్రామిసరీ నోట్‌లో ఈ తప్పులు చేస్తే మీ డబ్బులు వదిలేసుకోవడమే.. 

Follow Us