
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు రాతి విగ్రహాలు నదిలో బయట పడ్డాయి. ఒక్కసారిగా నది ఇసుకలో నాలుగు విగ్రహాలు బయటపడటం స్థానికుల్లో ఆశ్చర్యానికి గురి చేసింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అంబడపూడి వద్ద కృష్ణా నదిలో ఇసుక మేట వేసింది. దిగువకు నీరు పారటం లేదు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో నదిలో నీరు ప్రవాహం కూడా తక్కువగా ఉంది. దీంతో ఎగువ నుండి నీరు దిగువకు పారటం లేదు. రక్షిత త్రాగు నీటి పథకం పైపులైన్‌కు సైతం నీరు అందటం లేదు. ఈ నేపథ్యంలో స్థానికులు ఇసుక మేటలు తొలగించేందుకు సిద్ధమయ్యారు.
తొలగించిన ఇసుక మేటలు
రెండు రోజుల క్రితం స్థానిక రైతులు నదిలోకి వెళ్ళి నీటి ప్రవాహానికి వీలుగా ఇసుక మేటలు తొలగించారు. దీంతో పై నుండి నీటి ప్రవాహం జాలుగా మొదలైంది. రెండు రోజుల్లో నీటి ప్రవాహం కూడా పెరిగింది. ఈ క్రమంలోనే నిన్న స్థానిక యువకులు నదిలో స్నానానికి వెళ్ళారు. స్నానం చేస్తున్న క్రమంలో రాళ్ళు కాళ్ళకి తగిలాయి. దీంతో ఆ యువకులు ఏంటా అవి అని పరిశీలించి చూడగా మొదటి నంది విగ్రహాం కనిపించింది. ఆ తర్వాత వరుసగా నాలుగు విగ్రహాలు బయటపడ్డాయి. నంది, శివలింగం తో పాటు విష్ణు మూర్తి విగ్రహం, మరో విగ్రహం కూడా బయట పడ్డాయి. నాలుగు విగ్రహాలు ఒకేసారి బయటపడటంతో యువకులు ఆశ్చర్యపోయారు.
విగ్రహాలు ఎలా వచ్చాయి ?
నాలుగు విగ్రహాలు ఒకేచోట బయటపడటంతో ఎలా వచ్చి ఉంటాయన్న ప్రశ్న మొదలైంది. ఎవరైనా తీసుకొచ్చి జలాధివాసం చేశారా అంటూ స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు విగ్రహాలు గతంలో పూజలు అందుకున్నాయా అన్న ప్రశ్నలు కూడా స్థానికులు నోళ్ళలో నానుతున్నాయి. పురాతన దేవాలయాలను తొలగించిన సమయంలో తిరిగి ప్రతిష్ఠించే అవకాశం లేని వాళ్ళు జలాధివాసం చేసి ఉంటారని అనుకుంటున్నారు. మరోవైపు కృష్ణా నది తీర ప్రాంతంలో గుప్త నిధులు వేటగాళ్ళ తాకిడి ఎక్కువగా ఉంటుంది. పురాతన ఆలయాల్లో విగ్రహాలను తొలగించి గుప్త నిధుల కోసం వేట సాగిస్తుంటారు. అలా ఏమైనా జరిగిందా అన్న కోణంలోనూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
పై నుంచి వచ్చే అవకాశం లేదు..
పులిచింతల ప్రాజెక్టు పూర్తయి పదేళ్ళైంది. దీంతో పై నుండి విగ్రహాలు నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చే అవకాశం లేదు. పులిచింతల నుండి అంబడపూడి గ్రామం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ నలభై కిలోమీటర్లు పరిధిలోనే విగ్రహాలను పడేసి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు అంత బరువైన విగ్రహాలు నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చే అవకాశం లేదని మరికొంత మంది చెబుతున్నారు. మొత్తం మీద నాలుగు విగ్రహాలు బయట పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై అధికారులు ఏవిధంగా ముందుకు వెళ్తారో వేచి చూడాల్సిందే…