AP Politics: బీజేపీకి బైబై..! మళ్లీ టీడీపీకి సైసై..! ఆ మాజీ ఎమ్మెల్యే రూట్ మార్చినట్టేనా..
చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. పార్టీ వేరయినా అక్కడ ఆ మాజీ ఎమ్మెల్యే ఓ అడుగు ముందుకేసి ఏకంగా పోస్ట్ కార్డు ఉద్యమమే చేపట్టారు. చంద్రబాబు అరెస్టు వెనక కేంద్రంలో బిజెపి హస్తముందని ఓవైపు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే... అక్కడ ఆ బీజేపీ నేత చంద్రబాబుకు సపోర్టుగా ఉద్యమం చేపట్టడం దేనికి సంకేతం? ఆయన కమలంపార్టీలోనే కొనసాగుతారా? టీడీపీలోకి వెళ్లే ఆలోచనతో ఉన్నారా?
గోనుగుంట్ల సూర్యనారాయణ. ధర్మవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. 2014లో టీడీపీనుంచి గెలిచిన గోనుగుంట్ల.. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. ఇంత వరకు బాగానే ఉంది. ఓడిపోయారు.. బీజేపీలో చేరారు. కానీ చంద్రబాబు అరెస్టుతో మాజీ ఎమ్మెల్యే టీడీపీకి దగ్గరవుతున్నారా అన్న అనుమానాలొస్తున్నాయి అందరికీ.
ఎందుకంటే గోనుగుంట్ల టీడీపీ నేతలను మించిపోయేలా చంద్రబాబు అరెస్టుపై ఉద్యమిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రమే స్పందించారు. ఆ పార్టీలో మిగతా నేతలెవరూ చంద్రబాబు అరెస్టుపై పెద్దగా స్పందించలేదు. కానీ గోనుగుంట్ల సూర్యనారాయణ చంద్రబాబుకు మద్దతుగా ఉద్యమమే చేపట్టారు. ఏకంగా లక్ష పోస్ట్ కార్డులను రాష్ట్రపతికి పంపించి చంద్రబాబు అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరో 20 వేల పోస్టుకార్డులను సంఘీభావంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు పంపించారు.
చంద్రబాబు అరెస్టు అంశంలో ఏపీ బీజేపీ నాయకులు ఎవరూ స్పందించవద్దని పార్టీ పెద్దలనుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయినా మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టటంపై బీజేపీతో పాటు టీడీపీలోనూ పెద్ద చర్చే జరుగుతోంది. బీజేపీపై ఆయనది ధిక్కారస్వరమా లేదంటే టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని అనుకోవచ్చా? మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోస్ట్ కార్డులు దొరకడం కష్టమైపోయిందట. అర్ధ రూపాయికి దొరికే పోస్ట్ కార్డులు స్థానికంగా దొరకపోవడంతో కర్ణాటక నుంచి రూపాయిన్నర పెట్టి తెప్పించి మరీ ఉద్యమసెగ తగ్గకుండా చూస్తున్నారట మాజీ ఎమ్మెల్యే.
వాస్తవానికి గోనుగుంట్ల సూర్యనారాయణ చంద్రబాబుకు ఒకప్పుడు వీరవిధేయుడు. అయినా 2019 ఎన్నికల్లో ఓడిపోగానే కండువా మార్చేశారు. చంద్రబాబు అనుమతితోనే అప్పట్లో బీజేపీలో చేరారన్న ప్రచారం కూడా సాగింది. మరి ఇప్పుడు ఎందుకు టీడీపీకి దగ్గరవుతున్నారంటే వచ్చే ఎన్నికల్లో ధర్మవరం టికెట్ ఆశిస్తున్నారని గోనుగుంట్ల అనుచరులు బహిరంగంగానే చెబుతున్నారు. ఒకవైపు బీజేపీ చంద్రబాబు అరెస్టుపై ఎవరూ స్పందించవద్దని చెప్పిన తర్వాతకూడా ఇంత ధైర్యంగా చంద్రబాబు మద్దతుగా గోనుగుంట్ల పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం వెనుక కచ్చితంగా రాజకీయ కోణం కనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ధర్మవరంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి..
ధర్మవరం టీడీపీ ఇంచార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సునీతకు రాప్తాడు, ధర్మవరం టికెట్ శ్రీరామ్‌కి ఖాయమంటున్నారు పార్టీ తమ్ముళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల చంద్రబాబుకు మద్దతు ప్రకటించటంతో పాటు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం వెనుక అంతర్యం ఏమై ఉంటుదని ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే మళ్లీ టీడీపీలోకి వస్తారని ఏడాదికాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన టీడీపీలోకి వస్తానన్న సంకేతాలు ఇవ్వలేదు. అయితే ఈ పోస్ట్ కార్డు ఉద్యమంతో త్వరలోనే టీడీపీలోకి రాబోతున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది. మరి ఆయనొస్తే పరిటాల వారసుడి పరిస్థితేంటో?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..