ఏపీలో ఎన్నికల వేడి మొదలైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ నాయకులు సామాజిక సాధికార యాత్రల పేరుతో బస్సు యాత్ర చేస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు. ఇటు నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. జనసేన కూడా మన్నటి వరకు వారాహి పేరుతో యాత్రలను చేపట్టింది. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పార్టీ పుట్టుకొస్తోంది. విశాఖపట్నంలో సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. గత కొంత కాలంగా జేడీ లక్ష్మినారాయణ కొత్త పార్టీ పెడతారని వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు.
తాను కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కొత్త ఒరవడి, కొత్త ఆలోచనలతో యువతను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల్లో మళ్లీ విశాఖ నుంచే పోటీ చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు మంచి ప్రచారం లభించిందని చెప్పారు. ఆమెను ఎన్నుకోవలా, లేదా అన్నది ప్రజల ఆలోచనా విధానాని సంబంధించిన అంశం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేస్ లో ఉన్న కే ఏ పాల్ కు విశాఖ ఎంపి గా పోటీ చేసే అవసరం రాకపోవచ్చన్నారు. ఏపిలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. జేడి ఫౌండేషన్, నైపుణ్య అభివృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు జేడీ లక్షీనారాయణ.
గతంలో ఈయన రైతుల కష్టాలను తెలుసుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులతో మమేకం అవుతూ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. యువతకు స్పూర్తినిచ్చేందుకు తన వంతు కృషి చేస్తారు. విశాఖలో బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడంలో స్వచ్ఛ వైజాగ్ పేరుతో అనేక సామాజిక అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. గతంలో విశాఖ ఎంపీగా పోటీ చేసిన జేడీ లక్షీనారాయణ పార్టీ పెట్టి ఏమేరకు విజయం సాధిస్తారో తెలియాలంటే ఏపీ ఎన్నికల వరకూ వేచి చూడక తప్పదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..