Nellore District: కూతురు బర్త్ డే అని చాక్లెట్ ప్యాకెట్ కొన్నాడు.. విప్పి చూస్తే షాక్..
కుమార్తె పుట్టినరోజు కోసం చాక్లెట్ ప్యాకెట్స్ కొన్నాడు ఓ వ్యక్తి. అయితే బర్త్ డే రోజున పంచుదామని వాటిని ఓపెన్ చేసి.. కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఇంతకీ.. ఏం జరిగిందంటే...?
పేద, మధ్యతరగతి కుటుంబాలలోని పిల్లల బర్త్ డేలు చాలా సాదాసీదాగా ఉంటాయి. పొద్దునే లేచి తలస్నానం చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం.. గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని.. ఇంటి చుట్టపక్కల.. స్కూళ్లలో చాక్లెట్స్ పంచిపెట్టడం.. ఇది పుట్టిన రోజున షెడ్యూల్. ఈ క్రమంలో ఇటీవల నెల్లూరు జిల్లా కోవూరులో పుట్టినరోజు జరపుకుందామని ఆశపడిన బాలికకు వింత అనుభవం ఎదురైంది. కోవూరుకి చెందిన రఘురాం ఇటీవల తన కుమార్తె బర్త్ డే సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ షాపులో చాక్లెట్ బాక్స్ కొన్నాడు. అయితే బర్త్ డే రోజున ఆ చాకెట్లను పరిశీలిస్తే అన్నీ పురుగులే ఉన్నాయి. అదేంటని షాపు యజమానిని ప్రశ్నిస్తే.. అస్సలు పట్టించుకోలేదు. దీంతో రఘురాం తన పిల్లల్ని తీసుకుని నేరుగా తహశీల్దార్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న షాపుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అంతేకాదు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా సమాచారం చేరవేశాడు.
ఈ ఫిర్యాదుతో నెల్లూరు జిల్లా కోవూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. చాక్లెట్లు అమ్మిన షాపుతోపాటు, మిగతా షాపుల్లో సోదాలు నిర్వహించారు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు వస్తున్నారని ముందే ఉప్పందడంతో… ఎందుకైనా మంచిదని ఊర్లోని షాపులన్నీ క్లోజ్ చేశారు యజమానులు. అన్ని షాపులన్నీ మూతబడటంతో స్థానికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ క్రమంలో అధికారులు ఇంకోసారి పక్కాగా దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Also Read: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తోన్న వధువును చెంపపై కొట్టిన వరుడు.. ఆమె దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది