Anakapalle: చెరువులకూ వ్యర్థాల ముప్పు.. భారీగా చేపల మృత్యువాత.. చర్యలు చేపట్టాలని రైతుల డిమాండ్..

|

Oct 19, 2022 | 11:56 AM

చేపల చెరువుల రైతులకు తీవ్ర నష్టాలు తప్పడం లేదు. ఫార్మా కంపెనీల పుణ్యమా అని ఏర్పడుతున్న ఇబ్బందులు వారికి కడగండ్లు మిగుల్చుతున్నాయి. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్ధ జలాలతో రైతులు లక్షల..

Anakapalle: చెరువులకూ వ్యర్థాల ముప్పు.. భారీగా చేపల మృత్యువాత.. చర్యలు చేపట్టాలని రైతుల డిమాండ్..
Anakapalle Pharma
Follow us on

చేపల చెరువుల రైతులకు తీవ్ర నష్టాలు తప్పడం లేదు. ఫార్మా కంపెనీల పుణ్యమా అని ఏర్పడుతున్న ఇబ్బందులు వారికి కడగండ్లు మిగుల్చుతున్నాయి. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్ధ జలాలతో రైతులు లక్షల రూపాయాల్లో నష్టపోతున్నారు. ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోకపోవడంపై నిరనసలు వ్యక్తం అవుతున్నాయి. అనకాపల్లి జిల్లా పరవాడలో చేపల చెరువు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెద్ద చెరువులో చేపలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీల వ్యర్ధాల వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని రైతులు చెబుతున్నారు. దీంతో మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని, ఈ విషయంపై అప్పుడే అధికారులకు కంప్లైంట్ చేశామని రైతులు చెప్పారు. ఇప్పటికే పలు మార్లు సంబంధిత పార్మా కంపెనీలపై అధికారులకు కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలు పదేపదే పునరావృతం అవడం వల్ల రైతులు లక్షల్లో నష్టాల పాలవుతున్నారని చెప్పారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగడంతో రామ్ కీ సంస్థ రైతులకు నష్టపరిహారం చెల్లించిందని.. కాని ఇప్పుడు రైతుల నష్టాలను రామ్ కీ సంస్థ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు సార్లు రామ్ కీ యాజమాన్యంపై పలు కేసులు నమోదైన చర్యలు లేవన్నారు. వెంటనే చేపల చెరువుల రైతులకు జరుగున్న అన్యాయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆవేదన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాంకీ ఫార్మా సంస్థ రసాయన వ్యర్థాలను ఇష్టానుసారంగా బయటకు విడిచి పెట్టారు. దీంతో ఆ నీరు కాలువల ద్వారా వచ్చి, చేపల పెంపకం చేపడుతున్న చెరువులో కలుస్తోంది. దీంతో అధిక సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు పట్టించుకోవడం లేదని, చనిపోయిన చేపలకు పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. రసాయన వ్యర్థాలు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..