
ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న లోన్ చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ఆ ఇంటిని జప్తు చేయడంతో తీవ్ర మనస్థాపిని గురైన ఇంటి పెద్ద ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. యలమర్రు గ్రామానికి చెందిన హరి ఓం ప్రసాద్ అనే వ్యక్తి.. ఇంటి నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం10.98లక్షల రూ నగదును ఓ ప్రైవేట్ సంస్థ నుంచి లోన్ తీసుకున్నాడు. కుటుంబానికి సొంతింటిని ఇవ్వాలన్న ఆశతో ప్రారంభమైన ఆ ప్రయాణం చివరకు విషాదంగా ముగిసింది. లోన్ తీసుకున్న తర్వాత ఇంటి నిర్మాణం సాగింది. మొదట్లో లోన్ ఈఎంఐలు క్రమంగా చెల్లించారు. అయితే కాలక్రమేనా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓం ప్రసాద్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆదాయం తగ్గిపోవడం, కుటుంబ ఖర్చులు పెరగడం వలన మిగిలిన లోన్ మొత్తాన్ని చెల్లించలేని స్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఫైనాన్స్ సంస్థ న్యాయపరమైన చర్యలకు దిగింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఫైనాన్స్ ప్రతినిధులు ఇటీవల ఓం ప్రసాద్ ఇంటికి చేరుకొని తాళం వేశారు. తాను కట్టుకున్న ఇల్లు.. తన కళ్ళ ముందే మూసుకుపోవడం అతనిని తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.. ఆరోజు నుంచి ఓం ప్రసాద్ మౌనంగా మారిపోయాడు. ఏం చేయాలో అర్థంకాని స్థితికి చేరుకున్నాడు. చివరకు లోకాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓం ప్రసాద్ యలమర్రులోని రామాలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడే రామాలయం గేటుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో శాంతి, భక్తి నిండాల్సిన ఆ ప్రదేశం విషాదానికి వేదికయింది.
ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు ఓం ప్రసాద్ ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఓం ప్రసాద్ మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భార్యా పిల్లలు దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు.. సొంతింటి కలతో మొదలైన జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడం పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.