Andhra News: భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..
పల్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎన్ని సార్లు చెప్పినా వినకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ, ఇల్లు మారినా వెంటపడుతున్నాడనే కోపంతో ఒక వ్యక్తిని భార్యాభర్తలు కలిసి దారుణంగా హత్య చేశారు. బాధితుడి భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడిన భార్యభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఆమెకు పెళ్లైంది.. భర్త కూడా ఉన్నాడు.. అయినా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇంటిని మార్చేశాడు. అయితే భార్యలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.. అతడితో సంబంధాన్ని అలానే కంటిన్యూ చేసింది. దీంతో విసిగిపోయిన భర్త భార్యకు స్టార్ట్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆమె మరోసారి ఇంటికి రావద్దని ప్రియుడికి తేల్చి చెప్పింది. అయినా ప్రియుడిలో మార్పు రాకపోవడంతో భార్య భర్తలు కలిసి అతన్ని హతమర్చారు.
వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా పసుమర్రు గ్రామానికి చెందిన జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి టింకరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి చిలకలూరిపేట రెడ్ల బజార్‌లో నివాసం ఉండే కాలేషా వలి భార్య మనీషాతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం మనీషా భర్త కాలేషా వలికి తెలియడంతో భార్యను తీవ్రంగా హెచ్చరించాడు. వారి సంబంధానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో అక్కడి నుండి ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకు కాపురం మార్చాడు.
అయినప్పటికీ, జాకీర్ హుస్సేన్ ప్రవర్తనలో మార్పు రాలేదు. కొత్త ఇంటికి కూడా వస్తూ మనీషాతో సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో భర్త ఒత్తిడి మేరకు మనీషా.. ఇకపై తన ఇంటికి రావద్దని జాకీర్‌కు స్పష్టం చేసింది. అయినా జాకీర్ వినకపోవడంతో, విసిగిపోయిన మనీషా ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో ఎలాగైనా జాకీర్ హుస్సేన్‌ను వదిలించుకోవాలని భార్యాభర్తలిద్దరూ కలిసి హత్యకు వ్యూహం రచించారు.
ఈ నెల 1వ తేదీన మనీషా పథకం ప్రకారం జాకీర్ హుస్సేన్‌కు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంటి నుండి బయలుదేరిన జాకీర్ తిరిగి రాలేదు. ఇంటికి వచ్చిన జాకీర్‌పై కాలేషా వలి, మనీషా ఒక్కసారిగా దాడి చేశారు. మెడకు తాడుతో ఉచ్చు బిగించి, చెక్కతో బలంగా కొట్టడంతో జాకీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఒక ఆటోలో తీసుకెళ్లి వేలూరు – జాలాది రహదారి పక్కన పడేసి పరారయ్యారు.
ఇంటి నుంచి వెళ్లిన భర్త ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన జాకీర్ హుస్సేన్ భార్య షఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన వేలూరు – జాలాది రోడ్డులో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆనవాళ్లు సేకరించి, షఫియాను పిలిపించి చూపించగా అది జాకీర్ హుస్సేన్ మృతదేహమేనని నిర్ధారణ అయ్యింది.
తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేసిన షఫియా… కాలేషా వలి భార్య మనీషాతో తన భర్తకు ఉన్న వివాహేతర సంబంధం గురించి పోలీసులకు వివరించింది. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులైన కాలేషా వలి, మనీషాలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో భార్యాభర్తలిద్దరూ తామే దారుణానికి ఒడిగట్టినట్లు తప్పు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
