రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మరిన్ని కర్ఫ్యూ సడలింపులు ఇస్తోంది. తూర్పు గోదావరి, పశ్చమ గోదావరి జిల్లాలు మినహా రాష్ట్రమంతటా కర్ఫ్యూ సడలింపులు అమలు కానున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో గురువారం నుంచి కర్ఫ్యూను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా ప్రమాణాలు అమలు చేస్తూనే వాణిజ్య సంస్థలు, షాపులు, ఆఫీసు కార్యాలయాలు తెరిచేందుకు అనుమతించారు. కేసులు అదుపులోకిరాని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న సమయాల్లోనే యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇక మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 వరకు అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.. షాపులు, వాణిజ్య సంస్థలు, ఆఫీసులు తెరుచుకోవచ్చు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇక తూర్పు గోదావరి, పశ్చమ గోదావరి జిల్లాల్లో మాత్రం ఉదయం 6 గంటల సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఉంటాయి. ఈ నింబంధనలు జులై 14 వరకు అమల్లో ఉంటాయి.
ఇదిలావుంటే.. ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. క్రితం రోజుతో పోలిస్తే, కేసుల సంఖ్య బుధవారం స్వల్పంగా పెరిగింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 83,885 శాంపిళ్లను పరీక్షించగా.. 3,166 పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,11,231కి చేరింది. మంగళవారం కొత్తగా 4,019 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,65,956కి పెరిగింది.
కోవిడ్ కారణంగా కొత్తగా చిత్తూరులో నలుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు చొప్పున మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,919కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 32,356 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,26,08,072 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.