మళ్లీ అటువైపే జవహర్ మనసు లాగుతుందట..!
ఒకప్పుడు ఆయన మంత్రి.. ప్రస్తుతం మాజీ మంత్రి.. టీడీపీలో ఆయనకంటూ ఓ సముచిత స్థానం ఉండటమే కాకుండా.. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు విసరడంలో మేటి. ఆయనే కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్. ఎన్నికల ముందు ఆయనకు సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా ఏర్పడి.. ఆయన సిట్టింగ్ స్థానానికే ఎసరుపెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గంగా ఏర్పడిన కొందరు నేతలు.. సిట్టింగ్ స్థానం నుంచి కాకుండా వేరే చోటు నుంచి పోటీ చేయించేలా చేశారు. దీంతో ఇటు జవహర్.. అటు ఆయన […]
ఒకప్పుడు ఆయన మంత్రి.. ప్రస్తుతం మాజీ మంత్రి.. టీడీపీలో ఆయనకంటూ ఓ సముచిత స్థానం ఉండటమే కాకుండా.. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు విసరడంలో మేటి. ఆయనే కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్. ఎన్నికల ముందు ఆయనకు సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా ఏర్పడి.. ఆయన సిట్టింగ్ స్థానానికే ఎసరుపెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గంగా ఏర్పడిన కొందరు నేతలు.. సిట్టింగ్ స్థానం నుంచి కాకుండా వేరే చోటు నుంచి పోటీ చేయించేలా చేశారు. దీంతో ఇటు జవహర్.. అటు ఆయన వ్యతిరేక వర్గం ఇద్దరూ ఓటమిపాలయ్యారు.
అయితే.. మాటల్ని తూటాల్లా ప్రత్యర్థి పార్టీలపై వదిలే ఈ మాజీ మంత్రి జవహర్.. ప్రస్తుతం ఏం చేస్తున్నారు..? ఆయన పొలిటికల్ భవిష్యత్తు ఏంటి? అనేది ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. హాయిగా నెల జీతంతో హుందాగా గడిచిపోతున్నా టీచర్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరారు కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్. అనంతరం 2014లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అంతేకాదు అదృష్టం సైతం తన్నుకురావడంతో ఏకంగా ఎక్సైజ్‌శాఖకే మంత్రి అయ్యారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కొవ్వూరు నియోజకవర్గంలో కొందరు సొంత పార్టీ నేతలే.. జవహర్‌కు వ్యతిరేకంగా గ్రూపులు కట్టారు. అంతేకాదు.. జవహర్ వల్ల పార్టీ తీవ్రంగా నష్టపొతుందని.. ఎట్టిపరిస్థితుల్లో కొవ్వూరు టికెట్టు ఆయనకు ఇవ్వొద్దంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. దీంతో అధిష్టానం జవహర్‌ను తిరువూరుకు పంపి.. ఆయన సిట్టింగ్ స్థానమైన కొవ్వూరులో వంగలపూడి అనితకు టికెట్ కేటాయించారు. అయితే ఇటు తిరువూరులో జవహర్, కొవ్వూరులో అనిత ఇద్దరూ ఓటమిపాలయ్యారు. ఓటమి తర్వాత.. కొంతకాలం తిరువూరులోనే ఉన్నా.. ఆయన మనసు మాత్రం కొవ్వూరు వైపే లాగుతుందట.
కాగా.. తిరిగి తన సిట్టింగ్ నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. హైకమాండ్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. ఇక తిరువూరులో ఎంత చేసిన తన సామాజికవర్గం అక్కడ గెలవదనే ఆలోచనతో ఉన్న ఆయన.. ఎలాగో అలా కొవ్వూరులో ఉండి పార్టీని మళ్లీ తనవైపుకు తిప్పుకోవాలని భావిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా క్యాడర్ మాత్రం జవహర్‌ని కృష్ణా జిల్లా నేతగా ముద్రవేస్తున్నారు. అంతేకాదు.. పార్టీ సమీక్షా సమావేశాలకు కూడా ఆయనకు జిల్లా నుంచి పిలుపు రావడం లేదు. దీంతో.. ఏదో విధంగా అధిష్టానంను ఒప్పించి కొవ్వూరులో పర్మినెంట్‌గా మకాం వేసే విధంగా చూడాలని జవహర్ భావిస్తుంటే.. పార్టీ ఏ విషయం తేల్చడం లేదట. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత సంపాదించిన డబ్బు అంతా ఖర్చు అయిపోయిందని.. అటు ఆర్ధికంగా…ఇటు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయాయని జవహర్ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ప్లీజ్ నా ప్లేస్ నా కివ్వండి అంటున్న జవహర్ మనసును పార్టీ అధినేత అర్ధం చేసుకుంటారో..లేదో తెలియాలంటే ఈ నెల 18వరకు ఆగాల్సిందే.