Andhra Pradesh: అంతలోనే తీవ్ర విషాదం.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు సైతం మృత్యువు ఒడిలోకి..

| Edited By: Balaraju Goud

Aug 25, 2024 | 11:33 AM

మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు మృత్యు ఒడికి చేరుకున్నాడు. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన ఆ యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించాడు.

Andhra Pradesh: అంతలోనే తీవ్ర విషాదం.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు సైతం మృత్యువు ఒడిలోకి..
Pardhasaradhi
Follow us on

మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు మృత్యు ఒడికి చేరుకున్నాడు. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన ఆ యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మాలో జరిగిన దుర్ఘటనలో ఒక్కొక్క మృతి వెనుక ఒక్కో వ్యథ. దుర్ఘటనలో పార్థసారథి అనే యువకుడి మృతితో పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో పార్వతీపురం మండలం చలంవలస గ్రామానికి చెందిన పార్థసారథి మృతి కుటుంబసభ్యుల్లో విషాదాన్ని నింపింది. పార్వతీపురం మండలం చలంవలస గ్రామానికి చెందిన పార్థసారథి ఐటిఐ పూర్తి చేసి 2022 సెప్టెంబర్ నెలలో ఏసెన్షియా ఫార్మాలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. సుమారు రెండేళ్ళ క్రితం జాబ్ లో జాయిన్ అయిన పార్థసారథి అప్పటి నుండి ప్రతినెలా వచ్చే జీతం లో కొంత డబ్బు కుటుంబానికి ఇస్తూ వారికి అండగా ఉంటూ వస్తున్నాడు.

చదువుకుని ఉద్యోగం పొంది తమకు అండగా ఉంటున్న కొడుకును చూసి మురిసిపోయేవారు పార్థసారథి తల్లిదండ్రులు. ఉద్యోగం వచ్చింది ఆర్థికంగా ఇబ్బంది లేదు, వివాహం చేస్తే జీవితంలో సెటిల్ అవుతాడని పార్థసారథికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం అనేక సంబంధాలు చూశారు. తమ కొడుకు అందగాడని, హీరోలా ఉంటాడని, కొడుకు అందానికి తగ్గ అమ్మాయిని చూసి వివాహం చేయాలని చాలా సంబంధాలు చూశారు. చివరికి సీతానగరం మండలానికి చెందిన ఓ అందమైన యువతి తో పెళ్లి ఖరారు చేసుకున్నారు. అక్టోబర్ 5 న వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. అప్పటి నుండి అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. బట్టలు, బంగారం కొనుగోలు చేశారు. పెళ్లి కార్డులు సైతం పంచడం ప్రారంభించారు. పెళ్లి ఘనంగా చేయాలని కుటుంబ సభ్యులు సందడిగా మారారు.

ఈ క్రమంలో ఆగస్ట్ 21న మధ్యాహ్నం పార్థసారథికి డ్యూటీ లేదు, అయినా స్నేహితుడు పార్థసారథికి ఫోన్ చేసి నాకు తోడు ఎవరూ లేరు, మధ్యాహ్నం షిఫ్ట్ కి నువ్వు కూడా రావాలని కోరాడు. దీంతో కాదనలేని పార్థసారథి మధ్యాహ్నం షిఫ్ట్ కి వెళ్ళాడు. అలా వెళ్లిన కొద్దిసేపటికి ఫార్మాలో భారీ శబ్దాలతో దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనలో ఎవరు చనిపోయారు? ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగుల కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే అదే రోజు ప్రభుత్వ సిబ్బంది నుండి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ఫార్మాలో ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో పార్థసారథి మృతి చెందాడని తెలిపారు. విషయం తెలుసుకున్న పార్థసారథి తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మా కలల రాకుమారుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడా అని కన్నీరు మున్నీరుగా విలపించారు. మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన పార్థసారథి మృత్యుఒడికి చేరటం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్థసారథి మృతితో తాను వివాహమాడాల్సిన యువతి ఇంట్లో కూడా విషాదం నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..