
ఏలూరు : అక్రమ సంబంధాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. అన్నీ తెలిసిన వారే హద్దు మీరుతూ.. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. ఆ తర్వాత.. అఘాయిత్యాలకు పాల్పడటం లాంటి ఘటనలు తరచూ తెరపైకి వస్తున్నాయి.. తాజాగా ఓ వివాహేతర బంధం విషాదంగా మారిన ఘటన.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో కలకలం రేపింది. ఉండి రైల్వే స్టేషన్ దగ్గరలో కొబ్బరి తోటలో పురుగులు ముందు తాగి సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు విజయలక్ష్మి అనే మహిళ కనిపించడం లేదని ఆమె కుమార్తె పాలకొడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సుబ్బారావు ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు. సుబ్బారావు మృతదేహం వద్ద మూడు సెల్ ఫోన్లు, అతని జేబులో ఇంటి తాళం చెవిని పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో ఉండటంతో వాటిని ఆన్ చేసారు. ఆ ఫోన్ లలో ఒకటి రింగ్ కావడంతో లిఫ్ట్ చేసి పోలీసులు మాట్లాడారు. విజయలక్ష్మి కూతురు ఆ ఫోన్ కు కాల్ చేసి ఇది తన తల్లి ఫోన్ అని, నిన్నటి నుండి తన తల్లి కనిపించడం లేదని, పాలకొడేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసానని చెప్పింది. విజయలక్ష్మి ఫోన్ మృతుడు సుబ్బారావు దగ్గర ఉండటం, సుబ్బారావు చనిపోయి ఉండటంతో పోలీసు సుబ్బారావు ఇంటికి వెళ్ళి చూసారు. ఆ ఇంటిలో ఉరి వేసుకుని అప్పటికే విజయలక్ష్మి బలవన్మరణానికి పాల్పడింది.. ఇలా ఇద్దరూ గంటల వ్యవధిలోనే చనిపోవడం కలకలం రేపింది.
పాలకొడేరు మండలం మోగల్లు గ్రామం గుత్తులవారి పాలెంకు చెందిన దొంగ సుబ్బారావు, కడలి విజయలక్ష్మి సహజీవనం చేస్తున్నారు. వీళ్ళు అత్తిలిలో ఇల్లు తీసుకుని రహస్యంగా ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న సుబ్బారావు భార్య, బంధువులు గత సంవత్సరం జులై నెలలో విజయలక్ష్మిని గుత్తుల వారి పాలెం తీసుకుని వచ్చి స్థంభానికి కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. అప్పటి నుండి సుబ్బారావు ఇంటికి వెళ్ళలేదు. ఉండిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
అయితే విజయలక్ష్మి, సుబ్బారావు తమ బంధాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఎం జరిగిందో ఏమో.. తెలియదు కానీ విజయలక్ష్మి ఇంటో ఉరి వేసుకుని అనుమానాస్పద మృతి చెందింది. మృతదేహం ఇంటిలో ఉండగానే ఇంటికి తాళం వేసి సుబ్బారావు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బారావు ముందుగా విజయలక్ష్మిని హత్య చేసి, బయపడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మరో వైపు విజయలక్ష్మి చనిపోవటంతో భయంతో చనిపోయాడా అనేది మిస్టరీగా మారింది. ఈ క్రమంలో అన్నికోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..