Vizianagaram district news: సాయంత్రం నాలుగు అయితే భయం భయం. ఆరు దాటితే ఇళ్లకే పరిమితం. ఇంట్లో నుండి బయటకు రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.. పొలం వెళ్లిన రైతు ఇంటికే వచ్చే వరకు గ్యారంటీ లేదు. బయటకు వెళ్లిన మనిషి క్షేమంగా ఇంటికి వచ్చారంటే ఆ రోజుకు ఆ ఇంట్లో ఆనందమే.. గత కొన్నాళ్లుగా అదే పరిస్థితి. ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణం. పచ్చని పొలాలు.. స్వేచ్చగా తిరిగే ప్రజలు. అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా పొలాలకు వెళ్లి నీరు పెట్టుకొని పంటలు పండించుకుని కుటుంబంతో జీవనం సాగించేవారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మచ్చుకైనా లేవు. ఇంట్లో నుండి బయటకు వెళ్తుంటే అక్కడివారికి గుండె లబ్ డబ్ మంటుంది.. ఇంత జరుగుతున్నా అక్కడి అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదు. జరగుతున్న పరిణామాలు పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంలా మారింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సంతో పలు మండలాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండటంలేదు. నిత్యం పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తూ రెచ్చిపోతున్నాయి.. ఏనుగుల సంచారంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక ప్రాణభయంతో బ్రతుకుతున్నారు స్థానికులు.. ఇప్పటికే జిల్లాలో ఎనిమిది మంది మృత్యువాత పడగా సుమారు ముప్పై మందికి పైగా గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.. ఆస్థి నష్టానికి లెక్కేలేదు. ఇప్పుడు ఏనుగుల గుంపు మన్యం జిల్లా దాటి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించి విధ్వంసానికి తెగబడుతున్నాయి.
తాజాగా తెర్లామ్ మండలం రంగప్పవలస లో రైస్ మిల్లు ధ్వంసం చేయటం తో స్థానికులు హడలిపోతున్నారు. స్థానికులు ఏనుగుల బారి నుండి కాపాడండి మహాప్రభో అని వేడుకుంటుంటే మేమేం చేయలేం మీ జాగ్రతలు మీరు తీసుకోండి అంటున్నారు అటవీ శాఖ అధికారులు.. ఏది ఏమైనా వెల్డ్ యానిమల్స్ పట్ల స్థానికులు అప్రమత్తంగా లేకుంటే కష్టాలు తప్పవనే చెప్పాలి..
మరిన్ని ఏపీ వార్తల కోసం..